
‘నులి’పేసేది లేదా..!
ప్రభుత్వ నిర్ణయం
మేరకు వేస్తాం
నులిపురుగుల నివారణ మాత్రలు వేసే కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో చేపట్టాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం రద్దు చేసింది. మరోసారి నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ హరీశ్‌రాజ్,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
మంచిర్యాలటౌన్: చిన్నారుల్లో నులి పురుగులు నివారించేందుకు ప్రతియేటా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నులి పురుగుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 1 నుంచి 19ఏళ్లలోపు పిల్లల్లో నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కారణమేమిటో తెలియదు గానీ ఆ కార్యక్రమానికి ఒక రోజు ముందుగానే రద్దు చేశారు. మాత్రలను జిల్లాలకు పంపిణీ చేసిన అనంతరం ఏదో సమస్యతో అన్నింటినీ తిరిగి వెనక్కి తీసుకోవడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి నిలిపి వేసినట్లు తెలిసింది. రెండు నెలలు గడుస్తున్నా మాత్రలు వేసే కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. మరో పదిహేను రోజుల్లో విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. జూన్ 12న తిరిగి ప్రారంభిస్తారు. మరో రెండు నెలల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం లేదు. నులి పురుగుల బారిన పడిన పిల్లలు పలు రకాలుగా అనారోగ్యానికి గురవుతారు. ఈ ఆలస్యంతో వ్యాధిబారిన పడే చిన్నారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
జిల్లాలో చిన్నారులు..
జిల్లాలో 1నుంచి 19ఏళ్లలోపు పిల్లలు 1,83,113మంది ఉన్నారు. వీరిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన వారు 35,706, నమోదు కాని వారు 477మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 51,403మంది, నమోదు కాని వారు 197మంది, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నమోదైన వారు 7,049, నమోదు కాని వారు 1,033మంది, ప్రైవేటు స్కూళ్లలో నమోదైన వారు 72,229, నమోదైన ఇంటర్ విద్యార్థులు 15,370మంది ఉన్నారు.
ఫిబ్రవరిలో పంపిణీ చేయాల్సిన మాత్రలు
కారణం లేకుండానే నిలిపివేత
మరికొద్ది రోజుల్లో పాఠశాలలకు సెలవులు
వ్యాధి సంక్రమణ ఇలా..
బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన, అపరిశుభ్రమైన పరిసరాల్లో ఆటలు, చేతులు శుభ్రంగా కడుక్కోకుండా భోజనం చేయడం, చెప్పులు ధరించకుండానే మట్టిలో ఆడడం వల్ల పిల్లలు నులిపురుగుల బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి పిల్లల్లో సాధారణంగా వచ్చేదే అయినా.. వ్యాధిబారిన పడితే పలు రకాలుగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు వండిన ఆహార పదార్థాలపై దుమ్ము పడకుండా, ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టాలి. వేడిగా ఉండే ఆహారం భుజించి చేతి వేలి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. గోళ్లలో మురికి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మలమూత్ర విసర్జన బయట చేయకుండా, మరుగుదొడ్డిని వినియోగించిన అనంతరం చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. నులిపురుగుల బారిన పడినా, పడకపోయినా ప్రభుత్వం చేపట్టే నులిపురుగుల నివారణ కార్యక్రమంలో 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి.

‘నులి’పేసేది లేదా..!