
పల్లెలకు పాలనాధికారులు
● రెవెన్యూ పటిష్టానికి జీపీవో పేరుతో కొత్తగా పోస్టులు ● పూర్వ వీఆర్‌వో, వీఆర్‌ఏల నుంచి ఇప్పటికే ఆప్షన్ల స్వీకరణ ● జీపీవో నియామకాలతో రెవెన్యూ వ్యవస్థ బలం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పటిష్ట చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పాలనాధికారి (జీపీవో) పేరిట కొత్త ఉద్యోగ నియామకాలతో గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలను మెరుగుపరచాలని సంకల్పించింది. గతంలో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకుడు (వీఆర్‌ఏ) వ్యవస్థను రద్దు చేసి, వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన ప్రభుత్వం, ఈ నిర్ణయం వల్ల గ్రామాల్లో భూసమస్యలు, సంక్షేమ పథకాల గుర్తింపు, సర్వేలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించింది. దీంతో జీపీవో పోస్టుల ద్వారా రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి శ్రీకారం చుట్టింది.
జిల్లాలో ఇలా..
గతంలో వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు గ్రామాల్లో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేశారు. అయితే, 2022లో 167 మంది వీఆర్‌వోలను 37 శాఖల్లో, 2023లో 543 మంది వీఆర్‌ఏలను 11 శాఖల్లో సర్దుబాటు చేయడంతో గ్రామాల్లో భూసర్వేలు, హక్కు ల జారీ, విపత్తు సమాచార సేకరణ వంటి పనులు స్తంభించాయి. ఈ బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులపై పడ్డాయి. ఈ లోటును గుర్తించిన ప్రభుత్వం, జిల్లాలోని 385 రెవెన్యూ గ్రామాల కోసం జీపీవోలను నియమించాలని నిర్ణయించింది. అయితే, ప్రతి గ్రామానికి ఒక జీపీవో ఉంటారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఆప్షన్ల స్వీకరణ..
జీపీవో నియామకాల కోసం పూర్వ వీఆర్‌వో, వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు సేకరించగా, డిగ్రీ ఉన్నవారు లేదా ఇంటర్‌తో ఐదేళ్ల వీఆర్‌వో అనుభవం ఉన్నవారిని ఎంపిక చేస్తారు. వీరికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే, తిరిగి వచ్చేవారి సర్వీస్‌ను జీరో నుంచి ప్రారంభిస్తామని, గత సీనియారిటీని పరిగణనలోకి తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనను వీఆర్‌వో, వీఆర్‌ఏలు వ్యతిరేకిస్తున్నారు. జీవో 129 ప్రకారం, ఇతర శాఖల్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 60 వీఆర్‌వోలు, 160 వీఆర్‌ఏలతో కలిపి 220 మంది ఆప్షన్లు ఇచ్చారు. సర్వీస్‌ను గుర్తించి, పరీక్ష లేకుండా తిరిగి తీసుకోవాలని వీఆర్‌వో సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వామిదాస్ డిమాండ్ చేశారు.
గతంలో రెవెన్యూలో సిబ్బంది వివరాలు..
గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌ఓలు) 167
గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏలు) 543
గ్రామ పాలనాధికారి(పీజీఓ) పోస్టులకు వచ్చిన దరఖాస్తులు 220

పల్లెలకు పాలనాధికారులు