
గ్రూప్–1 లో మెరిసిన పొనకల్ వాసి
జన్నారం: ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు పట్టుదలతో చదివి గ్రూప్–1లో రాష్ట్రస్థాయిలో 161వ ర్యాంకు, మల్టీజోన్ 1లో 82వ ర్యాంకు సాధించాడు జన్నారం మండలం పొనకల్‌కు చెందిన నగూరి అనిల్‌కుమార్. నగూరి హరిదాసు, భాగ్య దంపతుల మూడో కుమారుడు అనిల్‌కుమార్ పదోతరగతి వరకు జన్నారం, ఇంటర్ కరీంనగర్ ప్రైవేట్ కళాశాలలో, బీటెక్ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. పదేళ్ల క్రితమే హరిదాసు అనారోగ్యంతో మృతి చెందాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు గ్రూప్స్‌కు ప్రిపేరయ్యాడు. ఇటీవల విడుదలైన గ్రూప్–3లో రాష్ట్రస్థాయిలో 862వ ర్యాంకు, గ్రూప్–2 లో 382వ ర్యాంకు సాధించాడు. నాలుగు నెలల క్రితం విడుదలైన గ్రూప్–4లో ఎంపికై ఉస్మానియా యూనివర్శిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేస్తున్నాడు. ఈ సందర్భంగా మండలానికి చెందిన పలువురు అనిల్‌కుమార్‌ను అభినందించారు.
చెక్‌బౌన్స్ కేసులో రెండేళ్ల జైలు
చెన్నూర్: మండలంలోని కిష్టంపేటకు చెందిన బొమ్మ శ్రీనివాస్ వేసిన చెక్‌బౌన్స్ కేసులో చెన్నూర్ మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన ఆలం సత్తయ్యకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని మంగళవారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పర్వతపు రవి తీర్పునిచ్చారు. అకౌంట్‌లో డబ్బులు లేకుండా చెక్కులు ఇస్తే చట్టపరమైన శిక్ష తప్పదని జడ్జి పేర్కొన్నారు.