
ముగిసిన ‘పది’ పరీక్షలు
మంచిర్యాలఅర్బన్/నెన్నెల/కోటపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు బుధవారం సాంఘికశాస్త్రం పేపరుతో ముగిసాయి. ఈసారి ఒక్క విద్యార్థి కూడా డిబార్ కాకుండా సాఫీగా పూర్తయ్యాయి. 99.70శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. చివరి రోజు రెగ్యులర్ విద్యార్థులు 9,209మందికి గాను 9,181మంది హాజరు కాగా, 49మంది గైర్హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 9,198 మందికి గాను 9,175మంది హాజరు కాగా 23మంది గైర్హాజరయ్యారు. గతంలో ఫెయిలైన వారిలో 11మందికి గాను ఐదుగురు రాలేదు. డీఈవో యాదయ్య ఐదు పరీక్ష కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ 15 పరీక్ష కేంద్రాలు తనిఖీ చేశారు. ఈ ఏడాది ముందస్తుగా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా విద్యుత్, తాగునీరు సౌకర్యం కల్పించారు.
ఆనందంలో మునిగితేలిన విద్యార్థులు
పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగియడంతో ఆనందంలో మునిగి తేలారు. చిరుదరహాసాలతో కేంద్రాల నుంచి బయట వేచి చూస్తున్న కుటుంబ సభ్యుల వద్దకు చేరారు. ఇదే చివరి రోజు కావడం, హైస్కూల్ విద్యకు స్వస్తి పలుకుతున్నామని చింతిస్తూనే మళ్లీ ఎప్పుడు కలుస్తామో అంటూ టాటా చెప్పుకోవడం, ఫోన్ నంబరు తీసుకోవడం కనిపించింది. హాస్టల్ విద్యార్థులు పెట్టె సర్దుకుని ఇంటిముఖం పట్టారు. కోటపల్లిలోని కేజీబీవీలో ఇన్నేళ్లు పాఠశాలతో ఉన్న బంధం ముగియడంతో విద్యార్థులు కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఉన్నత విద్య అభ్యసించి పాఠశాల, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఎస్‌వో హరిత, ఉపాధ్యాయులు సూచిస్తూ విద్యార్థులకు వీడ్కోలు పలికారు.