
ఆర్జీయూకేటీలో న్యాక్ సన్నాహక సమావేశం
బాసర: ఆర్జీయూకేటీలో నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (ఎన్‌ఏఏసీ) మూల్యాంకనానికి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని ఇన్‌చార్జి వీసీ ఎ.గోవర్ధన్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. సమావేశానికి ఓఎస్‌డీ, ఏవో, అసోసియేట్ డీన్లు, అధ్యాపకులు హాజరయ్యారు. ఇన్‌చార్జి వీసీ మాట్లాడుతూ న్యాక్ అక్రిడిటేషన్ ప్రక్రియ నిర్ధారించడానికి అధ్యాపకులు పూర్తివివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. యూనివర్శిటీ అకడమిక్, పరిపాలన, మౌలిక సదుపాయాల ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అధ్యాపకులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారు. ఆర్జీయూకేటీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు, ప్రణాళికబద్ధంగా ఈ ఎన్‌ఏఏసీ మూల్యాంకన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పలు నూతన కోర్సులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్శన్, ఏవో రణధీర్, అసోసియేటెడ్ డాక్టర్ విటల్, డాక్టర్ మహేశ్, డాక్టర్ చంద్రశేఖర్, హెచ్‌వోడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.