
మంగెనపల్లిలో ఉద్రిక్తత
● యజమాని ఇంటి ఎదుట పాలేరు మృతదేహం ● పరిహారం కోసం కుటుంబ సభ్యుల ఆందోళన
వేమనపల్లి: మండలంలోని మంగెనపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాలేరు కన్నయ్య, అతడి యజమాని ఎనగంటి చిన్నన్న మధ్య శుక్రవారం గొడవ జరగడం, కన్నయ్య మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. మృతదేహానికి చెన్నూర్ సివిల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం శనివారం సాయంత్రం తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని యజమాని చిన్నన్న ఇంటి ఎదుట ఉంచి వెళ్లిపోయారు. మృతికి కారణమైన యజమాని రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని, అప్పటివరకు మృతదేహాన్ని తీయబోమని భీష్మించుకు కూర్చున్నారు. స్థానిక కుల పెద్దలు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం యజమాని బంధువులతో సంప్రదింపులు జరిపారు. యజమాని కుటుంబ సభ్యులు పరారీలో ఉండడం, ఇంటికి తాళం వేసి ఉండడంతో మృతదేహాన్ని అక్కడే ఉంచారు. అర్ధరాత్రి వరకు పరిస్థితి అలాగే ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై శ్యాంపటేల్ సంఘటన స్థలానికి చేరుకుని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది.

మంగెనపల్లిలో ఉద్రిక్తత