
‘‘గతంలో ఏ సినిమా చూడాలనుకున్నా థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. ఎందుకంటే మూవీస్ చూసేందుకు నాకు మరో చాయిస్ లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాలు విడుదలైన ఎనిమిది వారాలకే ఓటీటీల్లో రిలీజ్ చేసి, మన సినిమా వ్యాపారాన్ని మనమే చంపేశాం’’ అని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan) ఆగ్రహావేదన వ్యక్తం చేశారు.
ఈ నెల 14న ఆమిర్ ఖాన్ బర్త్ డేని పురస్కరించుకుని ‘పీవీఆర్ ఐనాక్స్’ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ‘ఆమిర్ ఖాన్: సినిమా కా జాదూగర్’ పేరుతో ఆయన హిట్ సినిమాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమిర్ ఖాన్, రచయిత జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ‘‘గతంతో పోలిస్తే ప్రస్తుతం హిందీ చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి.
బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం లేని దక్షిణాది నటుల సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 600 నుంచి 700 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయి. మన సినిమాలను కూడా దక్షిణాది దర్శకులు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?’’ అంటూ ఆమిర్ ఖాన్‌ను ప్రశ్నించారు జావేద్ అక్తర్. ఇందుకు ఆమిర్ స్పందిస్తూ– ‘‘దక్షిణాది, ఉత్తరాది చిత్రాలు అనే విషయం సమస్యే కాదు... దర్శకులప్రాంతీయ నేపథ్యం కూడా అప్రస్తుతం.
సినిమా విడుదలైన ఎనిమిది వారాలకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. ఓటీటీలో ఎన్నిసార్లయినా ఫ్రీగా చూసే వీలుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఒక సినిమాని రెండు సార్లు ఎలా అమ్మాలో నాకు తెలియడం లేదు. థియేటర్లలో విడుదలైన మూడు లేదా నాలుగు నెలల తర్వాత ఓటీటీల్లో రిలీజ్ చేయాలి.
అప్పుడే థియేట్రికల్ బిజినెస్ బాగుంటుంది. ప్రేమ, కోపం, పగ వంటి ఎమోషన్స్ మీద బాలీవుడ్ రచయితలు, డైరెక్టర్స్ ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. కేవలం వినో దానికే పెద్ద పీట వేస్తున్నారు. పైగా మూలాలను మర్చిపోతున్నారు. దక్షిణాది చిత్రాల్లాగా భావోద్వేగాలను మిళితం చేయలేపోతున్నారు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment