మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమా మోషన్ పోస్టర్ చూసిన తర్వాత ఓ యువ రచయిత ఇది తన కథే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను ఆచార్య చిత్ర యూనిట్ తోసిపుచ్చింది. ఆచార్య కథపై వస్తున్న కాపీ ఆరోపణలు నిరాధారమైనవని గురువారం అధికారికంగా ప్రకటన వెలువడించింది. "ఆచార్య ఒరిజినల్ కథ. ఈ కథ, కాన్సెప్ట్ పూర్తిగా దర్శకుడు కొరటాల శివకు మాత్రమే చెందుతుంది. ఈ కథ కాపీ అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారం. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఆచార్య పోస్టర్‌ను రిలీజ్ చేశాం. దీనికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజ్ చూసి కొందరు రచయితలు ఇది వారి కథే అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. (చదవండి:చిరు ఫ్యాన్స్‌కు పండుగే.. డబుల్ ధమాకా!)
నిజానికి ఈ సినిమా కథ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అలాంటిది కేవలం మోషన్ పోస్టర్ చూసి కథ కాపీ చేశారనడం హాస్యాస్పదంగా ఉంది. ఆచార్య కథ పూర్తిగా ఒరిజినల్. కొరటాల శివలాంటి దిగ్గజ దర్శకులపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న రూమర్ల ఆధారంగా ఈ ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారం, ఎవరికి వారు ఊహించుకున్నవి మాత్రమే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆచార్య చిత్రాన్ని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం" అని చిత్రయూనిట్ తెలిపింది. (చదవండి: ఆచార్య కోసం ఆలయం)
Comments
Please login to add a commentAdd a comment