'ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు' అన్నారు పెద్దలు. జీవితంలో ఈ రెండూ అన్నింటికన్నా ఎంతో ప్రాముఖ్యమైనవని, అలాగే వాటిని బాధ్యతగా పూర్తి చేయడం అంతకన్నా కష్టతరమైనవని చెప్పకనే చెప్పారు. కానీ పెళ్లి చేయడం ఒక ఎత్తయితే దాన్ని కలకాలం నిలబెట్టడం కత్తి మీద సాముగా మారింది. కొందరు వివాహమైన కొంతకాలానికే విడాకులు తీసుకుంటున్నారు. సెకండ్ ఛాన్స్ అంటూ రెండో పెళ్లికి సిగ్నల్ ఇచ్చేస్తున్నారు, కానీ అది నిలబెట్టుకోవడం కూడా కష్టంగానే ఉంది. బుల్లితెర నటి దల్జీత్ కౌర్ కూడా ఈ కోవలోకే వస్తుంది.
మనస్పర్థలతో భర్తకు దూరం
చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్‌ను పెళ్లాడింది. వీరికి జైడన్ అనే కుమారుడు జన్మించాడు. మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్లపాటు తన కుమారుడితో కలిసి ఒంటరిగా ఉన్న దల్జీత్.. దుబాయ్‌లో జరిగిన ఫ్రెండ్స్ పార్టీలో నిఖిల్ పటేల్ అనే వ్యక్తిని కలిసింది. అతడికి అప్పటికే పెళ్లయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి విడిగా జీవిస్తున్నాడు (ఒకరు తల్లితో ఉంటే మరో అమ్మాయి ఇతడితోనే ఉంది).
రెండో పెళ్లి.. ఫోటోలు డిలీట్ చేసిన నటి
పార్టీలో ఇతడు తన పిల్లల గురించి, దల్జీత్ తన కొడుకు గురించి మాట్లాడింది. అలా పిల్లల మీద వారికున్న ప్రేమ ఇద్దరినీ కలిపింది. ఏడాది పాటు ప్రేమలో చెట్టాపట్టాలేసుకుని తిరిగాక గతేడాది మార్చిలో పెళ్లి చేసుకున్నారు. కొడుకును తీసుకుని అతడితోపాటు లండన్‌లో సెటిలైందీ బ్యూటీ. సడన్‌గా ఈ మధ్యే లండన్ నుంచి ఇండియాకు వచ్చేసింది. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను డిలీట్ చేసింది. తన బయోలో కూడా పటేల్ అనే పదాన్ని తొలగించింది. దీంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
నటి తల్లిదండ్రులకు సర్జరీ
దీనిపై నటి టీమ్ స్పందించింది. 'దల్జీత్, ఆమె కుమారుడు జైడన్ ఇండియాలోనే ఉన్నారు. దల్జీత్ తల్లిదండ్రులకు సర్జరీ చేయాల్సింది ఉంది. ఇప్పుడు ఆమె వారితో ఉండటం చాలా అవసరం. ఇలాంటి సమయంలో ఆమె ఏ అంశం గురించీ మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే మొత్తం వ్యవహారంలో పిల్లలు కూడా ఉన్నారు. వారి గోప్యతకు భంగం కలిగొంచవద్దు' అని ప్రకటన విడుదల చేసింది. దీంతో విడాకుల వార్తలు నిజమేనని ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు నెటిజన్లు. పెళ్లయి ఏడాది కూడా అవకముందే ఇలా విడిపోయారేంటని షాకవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment