‘‘భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలి? ఇప్పటి పిల్లలకు, తల్లిదండ్రులకు కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా ఉంది? వంటి అంశాలతో ఈ తరం వారికి అర్థమయ్యేలా ‘స్టాండప్ రాహుల్’ సినిమా కథను శాంటో పాజిటివ్‌గా చూపించారు’’ అని ఇంద్రజ అన్నారు. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది.
ఈ చిత్రంలో నటించిన ఇంద్రజ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రాజ్ తరుణ్‌కి తల్లి పాత్ర చేశాను. ఓ కుటుంబంలో తల్లి ప్రాధాన్యత ఎంత ఉంటుందో చక్కగా చూపించారు శాంటో. మురళీ శర్మగారు నా భర్తగా నటించారు. కానీ ఇంటి బాధ్యత నేనే తీసుకుంటాను. భర్తలో లేని క్వాలిటీని కొడుకు దగ్గర చూడాలని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచుతుంది తల్లి. అయినా కొడుకు కూడా తండ్రిలానే ఉన్నాడని తెలిసి బాధపడుతుంది.
చివరికి ఆ కుమారుడు తల్లిని ఏ విధంగా అర్థం చేసుకున్నాడనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. నేటి యువత పని, ప్యాషన్ అనే వాటిల్లో ఏదో ఒక దానికోసం కష్టపడుతుంటారు.. తమకు ఇష్టమైన పనిని చేస్తూనే ఎలా బతకవచ్చో ఈ సినిమాలో చక్కగా చూపించారు దర్శకుడు. ఈ సినిమా కాకుండా నేను నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న సినిమాతో పాటు నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో నటిస్తున్నాను’’ అన్నారు.
అందుకే గ్యాప్ తీసుకున్నా
‘‘తెలుగులో నాకు సక్సెస్ రేటు ఎక్కువ. అయితే మలయాళంలో హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడే 2006లో పెళ్లి చేసుకున్నాను. మా పాపకి ఎనిమిదేళ్లు వచ్చేవరకు సినిమాల్లో నటించకూడదనుకుని, గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు తనకి 13 ఏళ్లు. ఇప్పుడు కూడా నెలలో సగం రోజులు కుటుంబంతో, సగం రోజులు షూటింగ్‌లో ఉంటున్నాను’’ అన్నారు ఇంద్రజ.
సహాయ పాత్రలు మగవారికి బాగానే వస్తున్నాయి.. కానీ మహిళలకు సరైన పాత్రలు రావడం లేదు. అందుకే నాకు సినిమాల్లో చాలా గ్యాప్ వచ్చింది. రొటీన్ పాత్రలే రావడంతో కొన్ని వదులుకున్నాను. నటిగా సంతృప్తి అనేది ఎవరికీ ఉండదు. నటిగా నేను చేసింది గోరంత.. చేయాల్సింది కొండంత.
Comments
Please login to add a commentAdd a comment