కేరళ త్రిసూర్ దగ్గరలో ఉన్న కొచ్చిలో 'త్రిక్కయిల్ మహాదేవ ఆలయం' ఉంది. అక్కడి ఆలయం కోసం ఒక ఏనుగును కానుకగా సినీ నటి ప్రియమణి అందించారు. కానీ అది రోబోటిక్ ఏనుగు కావడం గమనార్హం. ఆమె రోబోటిక్ ఏనుగును ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే.. కేరళ, తమిళనాడులోని పలు ఆలయాల్లో భక్తులు గజరాజుల ఆశీర్వాదాలు పొందుతుంటారు. పలు క్షేత్రాల్లో ప్రత్యేకంగా ఏనుగులను పెంచుతూ ఉంటారు. అయితే అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలియదు. అంబారి కట్టినతర్వాత ఒక్కసారిగా ఘీంకారాలు పెడుతూ భక్తులపైకి వెళ్తూఉంటాయి. కొన్నిసార్లయితే శిక్షణ ఇచ్చిన మావటీలను చంపిన ఘటనలు చూస్తుంటాం. 15 ఏళ్ల కాలంలో కేరళలో బందీ అయిన ఏనుగులు 526 మందిని చంపాయని అక్కడి ప్రభుత్వాలు లెక్కలు చెబుతున్నాయి.
దీంతో అక్కడి పూజారులు రోబొటిక్ ఏనుగులు ప్రవేశపెట్టాలని పలుమార్లు కోరారు. అందుకు బడ్జెట్ ఎక్కువ కానున్నడంతో వారి ప్రతిపాదన ఆగిపోయింది. కానీ సంవత్సరం క్రితం పెటా ఇండియా సభ్యుల అధ్వర్యం ద్వారా ఇరింజలకుడ శ్రీకృష్ణ ఆలయానికి ఒక రోబోటిక్ ఏనుగు అందించారు. ఇప్పుడు తాజాగా కొచ్చిలోని త్రిక్కయిల్ మహాదేవ ఆలయానికి హీరోయిన్ ప్రియమణి కూడా ఒక ఏనుగును కానుకగా అందించి తన మంచి మనసును చాటుకుంది. ఇండియాలో ఒక ఆలయంలో రోబోటిక్ ఏనుగులను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ప్రియమణి అందించిన ఏనుగుకు 'మహదేవన్' అని పేరు పెట్టారు.
ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ.. 'బీటా సంస్థతో కలిసి రోబోటిక్ ఏనుగును బహుమతిగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వివాహ వేడుకల్లో అలంకరణకు మాత్రమే వినియోగించే ఈ యాంత్రిక ఏనుగులను ఇప్పుడు ఆలయాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ యాంత్రిక ఏనుగులను ఉపయోగించడం వల్ల ప్రాణాలతో ఉన్న ఏనుగులను హింసించడం తగ్గుతుందని ఆమె తెలిపింది. అంతే కాకుండా వాటి నుంచి పలువురి ప్రాణాలను కూడా రక్షించవచ్చు.' అని ఆమె తెలిపింది.
పదిన్నర అడుగుల ఎత్తు, 800 కిలోల బరువు ఉన్న ఈ యాంత్రిక ఏనుగు నలుగురిని తీసుకెళ్లగలదు. ఏనుగు తల, కళ్లు, నోరు, చెవులు, తోక అన్నీ విద్యుత్తుతో పనిచేస్తాయి. హిందూ ఆచారాల ప్రకారం ఉత్సవాల్లో ఏనుగులు, ఇతర జంతువులను ఉపయోగించకూడదని దేవస్థానం ఇచ్చిన పిలుపుతో పెటా ఇండియా సంస్థ వారు ప్రియమణి సాయంతో ఈ రోబోటిక్ ఏనుగును దేవాలయానికి బహుమతిగా అందించింది.
Comments
Please login to add a commentAdd a comment