ఇండియన్ ఐడెల్ సీజన్ 12లో మొన్నటి శని, ఆదివారాల ఎపిసోడ్‌లను ప్రముఖ నటి రేఖ పేరిట డెడికేట్ చేశారు. ఈ షో అతిథిగా పాల్గొన్నా ఆమె తన పాటలు కంటెస్టెంట్‌లు పాడుతూ ఉంటే ఎంతో ఎంజాయ్ చేశారు. ఆ సినిమా, పాటల చిత్రీకరణ సమయంలోని అనుభవనాలను ఈ సందర్భంగా ఆమె పంచుకున్నారు. ఒక కంటెస్టెంట్ ‘ఉమ్రావ్ జాన్’లోని ‘ఏ క్యా జగా హై దోస్తో’ పాడుతూ ఉంటే ఆ పాట వెనుక కథ ఇలా వివరించారు.
‘పాటల్లో అభినయం తాను ప్రత్యేకంగా నేర్చుకోలేదని... లతా మంగేష్కర్, ఆశా భోంస్లే పాడేది వింటే ఎక్స్‌ప్రెషన్స్ వాటికవి వచ్చేస్తాయి’ అని ఆమె అన్నారు. గట్టి చలికాలంలో లక్నోలో ‘ఉమ్రాన్ జాన్’ చేస్తున్నప్పుడు ‘ఏ క్యా జగా హై దోస్తో’ పాట చిత్రీకరణకు గ్లిజరిన్ కంట్లో పెట్టుకుంటే అది గడ్డ కట్టిందా అనిపించిందని ఆమె అన్నారు. షాట్ ప్రకారం చెమర్చిన కళ్లతో పాడాల్సి ఉన్నా చలి వల్ల గ్లిజరిన్ పని చేయక కన్నీరు రాలేదని, కాని ఒక్కసారి నగారాలో పాట మొదలయ్యాక ఆశాభోంస్లే పాటకు హృదయం ద్రవించి కన్నీరు వచ్చాయని ఆమె పేర్కొన్నారు.
దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ గురించి కూడా ఆమె ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.‘ఆయన కాస్ట్యూమ్స్‌కు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టేవాడు కాదు. ‘ఖూబ్‌సూరత్’లో నేను నటించేటప్పుడు అది గమనించి ఇంటి దగ్గరి నుంచి మంచి మంచి డ్రస్సులు వేసుకొని వచ్చేదాన్ని. వాటిని ఆయన చూసి ఇవే బాగున్నాయి... వీటిలోనే నటించు అనేవాడు’ అని ఆమె గుర్తు చేసుకుంది. రేఖకు ఇప్పుడు 67 సంవత్సరాలు. కాని రెండు ఎపిసోడ్లలో ఆమె అద్భుతంగా డాన్సు చేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. డోలక్ వాయిస్తున్నట్టు అభినయించింది. రేఖా ఎప్పటికీ రేఖానే అనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment