సులక్షణ.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె ఒకానొక సమయంలో దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. తర్వాత అమ్మ పాత్రలు సైతం చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. అయితే చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం, ముగ్గురు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకోవడంతో తన జీవితం అస్తవ్యస్తమైపోయింది. వ్యక్తిగత సమస్యలు కెరీర్‌ను దెబ్బ తీశాయి. దీంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరమైంది. కానీ బతుకుబండిని నడిపించడం కోసం తిరిగి వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది, కానీ పూర్వ వైభవం అందుకోలేకపోయింది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ చేస్తున్న ఆమె తాజాగా తన జీవితంలోని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.
18 ఏళ్లకే పెళ్లి.. 23 ఏళ్లకే విడాకులు
సులక్షణ మాట్లాడుతూ.. '18 ఏళ్ల వయసులోనే నా పెళ్లి జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎస్ విశ్వనాథన్ తనయుడు గోపికృష్ణన్‌ను పెళ్లి చేసుకున్నాను. మాకు ముగ్గురు పిల్లలు సంతానం. ఏ బంధమైనా సరే ఎప్పుడూ గొడవపడుతూ కలిసి ఉండేకన్నా విడిపోవడమే మంచిది. కలిసి కొట్టుకోవడం కన్నా విడిపోయి స్నేహితులుగా ఉండటం చాలా బెటర్. కానీ విడాకులు తీసుకోవాలంటే ఆ బాధను తట్టుకోగలగాలి. దీనివల్ల పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు. 23 ఏళ్ల వయసులో విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. పిల్లల కోసమే బతికాను.
భరణం ఆశించలేదు..
విడిపోదామనుకున్నప్పుడు మరీ అంత బాధపడలేదు. కానీ కోర్టులో విడాకులు మంజూరు చేసినప్పుడు గుక్క పెట్టి ఏడ్చేశాను. ఎందుకంటే ఆరోజు సర్వస్వం కోల్పోయినట్లనిపించింది. నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడ్డాను. విడాకుల తర్వాత ముగ్గురి పిల్లల బాధ్యత నేనే చూసుకున్నాను. మాజీ భర్త నుంచి ఎటువంటి భరణం ఆశించలేదు. అందుకు నేను గర్వపడుతున్నాను. అయితే మా లాయర్ భరణం అడగమని, పిల్లల గురించి ఆలోచించైనా డబ్బులు డిమాండ్ చేయమని చెప్పాడు. కానీ నాకు కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి కదా.. నేను బతకగలను.. ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. అతడి దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా నాకు వద్దని చెప్పేశాను.
పిల్లల కోసం సినిమాల్లో బిజీ అయ్యా..
మొదట్లో పిల్లలను చూసుకోవడానికి ఏడేళ్లపాటు సినిమాలకు దూరమయ్యాను. కానీ అది కరెక్ట్ కాదనిపించింది. బ్యాంకులో ఉన్నదంతా తింటూ పోతే చివరకు ఏమీ మిగలదని తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాను. పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించాలని కష్టపడ్డాను. నాన్న ఉంటే మాకోసం అది చేసేవాడు, ఇది చేసేవాడు అన్న ఆలోచన వారికి ఏనాడూ రానివ్వలేదు. సినిమాలతో బిజీ అయ్యాను. కథ కూడా వినకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాను' అని చెప్పుకొచ్చింది.
అవకాశాల్లేక వెండితెరకు దూరం
సులక్షణ ఆంధప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో జన్మించింది. రెండున్నరేళ్ల వయసులో 'కావ్య తలైవి' సినిమాలో చిన్నారి కృష్ణ/డాలీగా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన ఆమె చంద్రమోహన్ 'శుభోదయం' సినిమాతో హీరోయిన్‌గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 450 సినిమాలు చేసింది. ప్రేమ నక్షత్రం, మా ఇంటాయన కథ, మా ఇంటి ప్రేమాయణం, అల్లుళ్లు వస్తున్నారు, డబ్బెవరికి చేదు వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె నటించిన చివరి చిత్రం గజినీకాంత్ (2018). సులక్షణ ప్రస్తుతం తమిళ, మలయాళంలో సీరియల్స్ చేస్తోంది.
చదవండి: కేఎల్ రాహుల్‌పై ట్రోలింగ్.. 100 రెట్లు ఎక్కువ బాధపడతా.. కానీ తను.
Comments
Please login to add a commentAdd a comment