![Akshay Kumar About Stone Eye Lens In Bachchhan Pandey - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/21/akkibac.jpg.webp?itok=lxKjJAi2)
Akshay Kumar About Stone Eye Lens In Bachchhan Pandey: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు ప్రాణం పెట్టి నటిస్తాడు. సన్నివేశం బాగా వచ్చేందుకు రియల్ స్టంట్స్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయన్ను యాక్షన్ హీరో అని ముద్దుగా పిలుచుకుంటుంది బీటౌన్. 'సూర్యవంశీ', 'ఆత్రంగి రే' చిత్రాలతో అదరగొట్టిన అక్కీ ఇటీవల 'బచ్చన్ పాండే'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళంలోని 'జిగర్తాండ' మూవీకి రీమేక్. ఇందులో ప్రజల్ని చంపే క్రూరమైన, కనికరం లేని గ్యాంగ్‌స్టర్ పాత్రతో అక్షయ్ కుమార్ అలరించాడు. ఆ పాత్రకి తగినట్లుగా అక్కీ వేషధారణ కూడా ఉంటుంది. మనసులేని బండరాయి వంటి మనిషిగా ఒక కన్నుకు 'స్టోన్ ఐ లెన్స్'తో క్రూరంగా అక్కీని చూపించారు. అయితే ఆ 'స్టోన్ ఐ లెన్స్' పెట్టుకోవడం అక్షయ్‌ను తీవ్ర ఇబ్బందికి గురి చేసిందట.
ఇటీవల ఢిల్లీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'స్టోన్ ఐ లెన్స్'తో ఎలా ఇబ్బంది పడ్డాడో చెప్పుకొచ్చాడు అక్షయ్ కుమార్. 'ఇది చాలా పెద్ద లెన్స్. నాకు నేను సొంతగా అమర్చుకోలేకపోయేవాన్ని. షూటింగ్ మొదటి రోజు ఆ లెన్స్ సెట్ చేసుకోవడానికి 15 నిమిషాలు పట్టింది. తర్వాత రోజు నుంచి 2-3 నిమిషాలు పట్టింది. కానీ ఆ లెన్స్ పెట్టుకున్నప్పుడు షూటింగ్‌లో నాకు ఏం కనిపించేది కాదు. నా చూపు అస్పష్టంగా ఉండేది. ప్రాణం పోయినంత పనైంది. సినిమా చిత్రీకరణ మొత్తం అలానే జరిగింది.' అని తెలిపాడు. 'బచ్చన్ పాండే' మార్చి 18న విడుదలై రూ. 13.25 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను ప్రారంభించింది. రెండో రోజున రూ. 12 కోట్లు వసూలు చేసింది. సాజిద్ నడియద్‌వాలా నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీకి పర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment