
దివంగత నటుడు అనుపమ్ శ్యామ్ సోదరుడు అనురాగ్ శ్యామ్ బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట మీద నిలబడి ఉంటే ఈ రోజు మా అన్నయ్య ప్రాణాలతో ఉండేవారని పేర్కొన్నాడు. కాగా అనుపమ్ శ్యామ్ ఆగష్టు 9న అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే డయాలసిస్ చేయించుకునేవారు. ఈ క్రమంలో ఇటీవల ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరినచికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మృత్యువాత పడ్డారు.
అనుపమ్ మృతిపై ఆయన సోదరుడు అనురాగ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఆమిర్ ఖాన్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. అన్నయ్య(అనుపమ్ శ్యామ్)కు ఆరోగ్యం క్షీణించిన సమయంలోనే వారి తల్లి కూడా అనారోగ్యంతో మరణించిందని చెప్పాడు. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని పేర్కొన్నాడు. ‘అన్నయ్య డయాలసీస్ కోసం డబ్బు కావాలని ఇండస్ట్రీలో తనకు తెలిసిన వారికి ఫోన్ చేశారు. అలాగే ఆమిర్ ఖాన్‌కు కూడా చేశారు. ఆయన మొదట తమకు సాయం చేస్తానని, పర్సనల్ లోన్ ఇప్పిస్తానని కూడా హామి ఇచ్చారు. కానీ ఆ తర్వాత మా ఫోన్ ఎత్తడం మానేశారు. ఎన్నిసార్లు ఆయనను కనెక్ట్ అవుతామనుకున్న దొరకలేదు.
చివరకు మెసెజ్‌లు కూడా చేశాం. వాటికి కూడా సమాధానం లేదు. దీంతో ఆయన తీరు చూసి అన్నయ్య బాధపడ్డారు. వదిలేయండి.. తన ఈ అభిప్రామానికి ఆమిర్ అర్హుడు. కానీ ఆయనను బలవంతం చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అని అన్నారు’ అంటూ అనురాగ్ భావోద్వేగానికి లోనయ్యాడు. అదే విధంగా ఒకవేళ ఆమిర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఉంటే ఈ రోజు అన్నయ్య(అనుపమ్ శ్యామ్) మన మధ్యే ఉండేవారు. కానీ ఆయన నమ్మిన వారే చివరకు సహాయం చేయలేకపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా అనుపమ్ శ్యామ్ ఆమిర్ ఖాన్ ‘లాగాన్’ చిత్రంలో నటించారు. దీనితో పాటు ఆయన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ వంటి చిత్రాలు,ఇంకా పలు పాపులర్ టీవీ సీరియల్స్‌లో నటించారు.