చారడేసి కళ్లు, అమాయకత్వం నిండిన చూపు, కల్మషం లేని నవ్వు, ఒత్తైన జుట్టు.. ఒక్కమాటలో చెప్పాలంటే అందానికి పర్యాయ పదం అనుపమ పరమేశ్వరన్. అందం ఒకటేనా, అభినయంతోనూ ప్రేక్షకుల మనసు దోచుకుందామె. నేడు(ఫిబ్రవరి 18) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి మీకు తెలిసిన విషయాలను గుర్తు చేస్తూ, తెలియని విషయాలను చెప్పుకుందాం..
కేరళలోని త్రిసూర్ జిల్లా, ఇరంజలకుడ పట్టణం అనుపమ పరమేశ్వరన్ స్వస్థలం. పరమేశ్వరన్, సునీత దంపతులకు 1996 ఫిబ్రవరి 18న జన్మించింది. ఆమెకు ఓ సోదరుడు(అక్షయ్ పరమేశ్వరన్) ఉన్నాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన అనుపమ డిగ్రీ అభ్యసిస్తున్న సమయంలో సినిమా అవకాశం వచ్చింది. దీంతో చదువు అటకెక్కింది. కానీ తర్వాత వీలు చూసుకుని దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసింది.
అనుపమకు కూడా ఓ ముద్దుపేరు ఉంది. ఆమె ఇంట్లోనే కాదు, బంధువులు, స్నేహితులు కూడా అనుపమను పొన్ను అని ప్రేమగా పిలుచుకుంటారు. పొన్ను అంటే బంగారం అని అర్థం. చిన్నప్పుడు ఆమె తన ఇంటి దగ్గరలోని థియేటర్ ఆర్ట్స్‌కు సంబంధించిన స్కూల్‌లో జాయిన్ అయి యాక్టింగ్ నేర్చుకుంది. స్కూలు డ్రామాల్లో కూడా నటించేది.
ఆమె టాలెంట్‌ను గుర్తించిన స్నేహితురాలు మలయాళ 'ప్రేమమ్' సినిమా ఆడిషన్స్‌కు ఫొటోలు పంపమని అనుపమను ఒత్తిడి చేసింది. మొదట్లో అంత ఆసక్తి చూపకపోయినా స్నేహితురాలు బలవంతంతో ఫొటోలు పంపించింది. అయినా హీరో నివిన్ పౌలి పక్కన నటించే ఛాన్స్ అంత ఈజీగా రాదని పెద్దగా ఆశలు కూడా పెట్టుకోలేదీ బ్యూటీ. కానీ కొన్ని రోజులకు చిత్రయూనిట్ ఫోన్ చేసి రమ్మనడం, ఆడిషన్స్‌కు హాజరై ఎంపికవడంతో షాక్ తింది. ఇంట్లో వాళ్లకు మొదట్లో నచ్చకపోయినా ప్రేమమ్ తర్వాత ఆమె ఇష్టానికే ఓటేశారు. ప్రేమమ్‌లో నటించే సమయానికి అనుపమకు 19 ఏళ్లే.
తెలుగులో మొదటి చిత్రం 'అఆ'లో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. ఇందులో నాగవల్లిగా మెప్పించిన అనుపమను బోలెడన్ని అవకాశాలు వరించాయి. ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ.. ఇలా ఆమె చేసిన ప్రతి సినిమా హిట్టవుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె నిఖిల్ సరసన 18 పేజీస్‌లో నటిస్తోంది. దీనితోపాటు మరో రెండు తెలుగు చిత్రాలకు సంతకం చేసినట్లు సమాచారం. తమిళంలో ఆమె నటించిన రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్నాయి.
అందరికీ నటిగానే సుపరిచితురాలైన అనుపమ ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. ఓటీటీలో విడుదలైన మనియారయిలే అశోకన్‌లో నటించడంతోపాటు సహాయ దర్శకురాలిగా మెప్పించింది. ఇక ఈ హీరోయిన్ చాలాసార్లు మనసు పారేసుకుందట. కాకపోతే అందులో ఒక్కటీ సీరియస్ కాదట.
ఇష్టాలు:
పెయింటింగ్
పాటలు పాడటం
సాధు జంతువులు
Comments
Please login to add a commentAdd a comment