‘‘అమ్మ చేతి వంట అద్భుతం. ఆ రుచే వేరు’’ అంటున్నారు నటి అనుష్కా శర్మ. ఇద్దరు పిల్లలకు తల్లయిన ఆమె వంటల విషయంలో తల్లి సలహాలు తీసుకుంటారట. అది మాత్రమే కాదు.. భర్త విరాట్ కోహ్లీ (క్రికెటర్) కూడా వంట విషయంలో సహాయం చేస్తారని అనుష్క అంటున్నారు. 2017లో విరాట్–అనుష్క పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021లో ఒక పాప (వామికా), ఈ ఏడాది ఒక బాబు (అకాయ్)కి జన్మనిచ్చారు అనుష్కా శర్మ. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె తన పిల్లల గురించి పంచుకున్న విశేషాలు ఈ విధంగా...
అమ్మ చేతి వంట అద్భుతం
మన అమ్మ మనకు వండి పెట్టిన వంటలను మన తర్వాతి తరానికి రుచి చూపించాల్సిన అవసరం చాలా ఉంది. మేం (విరాట్–అనుష్క) ఇద్దరం ఫుడ్ గురించి చర్చించుకున్నప్పుడు మన అమ్మ మన కోసం వండిన వంటకాల తాలూకు రెసిపీలు మన పిల్లలకు కూడా తెలియాలి అని చెప్పుకున్నాం. అందుకే ఒకసారి తను, ఇంకోసారి నేను వంట చేస్తుంటాం. అచ్చంగా మా అమ్మ మాకు ఎలా వండి పెట్టారో అలాగే చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఒక్కోసారి విరాట్‌కి తెలియకుండా నేను మా అమ్మకు ఫోన్ చేసి, రెసిపీలు అడుగుతుంటా. ఆ విధంగా తనని మోసం చేస్తుంటాను (సరదాగా). మన పెద్దల తాలూకు విలువైన విషయాలు మన పిల్లలకు నేర్పడం చాలా ముఖ్యం. సంప్రదాయ వంటకాల గురించి వాళ్లకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
ఎక్కడికి వెళ్లినా ఆహార నియమాలు తప్పవు
మేం రోజుల తరబడి ఇంటిపట్టున ఉండం. ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాం. అందుకని మా పిల్లలు చాలా మార్పులకు అలవాటు పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆహార నియమాల్లో తేడా వస్తుంటుంది. కానీ నేను మాత్రం ఆ తేడా రానివ్వను. ఇంట్లో ఉన్నప్పుడు సరైన సమయానికి ఆహారం తీసుకున్నట్లే వేరే ప్రదేశాలకు వెళ్లినప్పుడూ తీసుకుంటాం. ఆ టైమ్ తప్పనివ్వను. అలాగే నిద్రపోయే సమయం కూడా. మేం ఎక్కడ ఉన్నా సరే ఒకే సమయానికి నిద్రపోతాం. ఇలా దినచర్య ప్రాపర్‌గా ఉంటే పిల్లలు వాళ్లను వాళ్లు అందుకు తగ్గట్టుగా మలచుకుంటారు.
పిల్లల కోసం సమయం కేటాయించాలి
మన పిల్లలు మనకు కొన్ని క్లూస్ ఇస్తుంటారు. అవి మనం గ్రహించగలగాలి. వాళ్ల కోసం మనం తగినంత సమయం కేటాయించాలి. నేనెప్పుడూ పిల్లలకు సమయం కేటాయించడానికి ట్రై చేస్తాను. ఇలా చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మనల్ని పిల్లలు అనుసరిస్తుంటారు
పిల్లలకు అమ్మే తొలి టీచర్. అయితే నా కూతురికి ఇప్పుడు ఏమైనా నేర్పించాలంటే తను చాలా చిన్నది. అందుకని తనకు ఏమైనా నేర్పించడం అంటే అది కష్టమే. అయితే మనం మన జీవితాలను ఎలా గడుపుతున్నామన్నది ముఖ్యం. మన దైనందిన జీవితంలో మనం ఇతరుల పట్ల కృతజ్ఞత చూపుతున్నామా? మన జీవితంలో ఉన్న విషయాలకు మనం కృతజ్ఞతతో ఉన్నామా? అనేది ముఖ్యం.
మనం అలా ఉంటే మన పిల్లలు కూడా అదే పాటిస్తారు. అందుకే ప్రత్యేకంగా నేర్పించే బదులు మనం చేసేవి పద్ధతిగా చేస్తే అది చూసి వాళ్లు నేర్చుకుంటారు... అనుసరించడానికి ప్రయత్నిస్తారు. ఒక్కోసారి పిల్లలు కొంచెం తేడాగా ప్రవరిస్తారు. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే వాళ్లు పిల్లలు కాబట్టి. వాళ్లు అమర్యాదగా నడుచుకున్నప్పుడు మనం వేరేలా అనుకోకుండా కరెక్ట్‌గా గైడ్ చేయడానికి ప్రయత్నించాలి. మనం మాటల రూపంలోనే అన్నీ చెప్పక్కర్లేదు. మన తీరు బాగుంటే అదే వారికి పెద్ద ఉదాహరణ.
Comments
Please login to add a commentAdd a comment