లక్ష్మీ పార్వతి వేదిక ఎక్కగానే.. చంద్రబాబు అలా.. | Behind The Reason Of Lakshmi Parvathi, NTR Marriage | Sakshi
Sakshi News home page

లక్ష్మీ పార్వతి వేదిక ఎక్కగానే.. చంద్రబాబు అలా..

Published Sun, Sep 3 2023 1:47 PM | Last Updated on Mon, Sep 4 2023 11:04 AM

Behind The Reason Of Lakshmi Parvathi, NTR Marriage - Sakshi

దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీ రామారావు అంటే తెలుగు ప్రజల్లో ఆరాధ్య భావం ఉంటుంది. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన నందమూరి తారకరామారావు మొదట సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎనలేని గుర్తింపు పొందారు.. అదే మాదిరిగా రాజకీయ రంగంలో కూడా చరిత్ర సృష్టించారు. దేశ వ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి ఎంతో ఘన చరిత్ర కలిగిన ఎన్టీఆర్.. తన జీవితంలోని చివరి ఘడియల్లో మాత్రం చాలా దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. తన సొంత కుటుంబానికే చెందిన వాళ్లే తిరుగుబావుటా ఎగరేసి.. ఎన్టీఆర్‌ను అత్యంత అవమానకర రీతిలో ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు.

ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు వారు సాకుగా చూపించిన ఏకైక వ్యక్తి.. లక్ష్మీపార్వతి! ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన జీవితంలోకి వచ్చిన లక్ష్మీపార్వతి.. కడవరకూ ఆయన వెన్నంటే ఉన్నారు. లక్ష్మీపార్వతి పేరు లేకుండా ఆయన చరిత్ర గురించి చెప్పడం కష్టమే అనేంతలా ఆయన జీవితంలో ఆమె కీలక పాత్ర పోషించారు.  చరిత్రలో స్త్రీ పాత్ర లేకుండా ఎపిసోడ్లు లేవు. అలా ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా వచ్చారు..? ఆమెకు ఆయన ఇచ్చిన స్థానం ఎలాంటిది..? ఎన్టీఆర్‌ చివరి రోజుల్లో అచేతన స్థితిలో ఉంటే లక్ష్మీపార్వతి చేసిన సేవ ఎలాంటిది..? ఎన్టీఆర్‌కు ఎంతో సేవ చేసిన ఆమెపై కుట్రలు పన్నింది ఎవరు..? నాడు ఇవ్వన్నీ ప్రత్యక్షంగా చూసిన ప్రముఖ జర్నలిస్ట్‌ దాసు కేశవ రావు ఈ వ్యాసం ద్వారా తెలిపారు.

ఎన్టీఆర్‌ను లక్ష్మీపార్వతి ఎందుకు కలిశారు?
గుంటూరు జిల్లా పచ్చల తాడిపర్రుకు చెందిన లక్ష్మీపార్వతిని మొదటగా వీరగంధం వెంకట సుబ్బారావు వివాహం చేసుకున్నారు. ఆయన హరికథా విద్వాంసుడు.  లక్ష్మీపార్వతి కంటే ఆయన  20 ఏళ్లు పెద్దవాడు. ఆమె పెళ్లి నాటికే తెలుగు భాషా పాండిత్యం మీద మంచి పట్టు సాధించి ఉన్నారు. భారత ఇతిహాసాలు, పురాణాల పట్ల లక్ష్మీపార్వతికి మంచి పరిజ్ఞానం ఉంది. ఆప్పట్లో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక కళాశాలలో ఉపాధ్యాయురాలిగా కూడా బోధించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి M. Phil పూర్తి చేసిన ఆమె పీహెచ్‌డీ కోసం  నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగా  'సినిమాలో పౌరాణిక విశేషాలు అంశంపై ఆమె పరిశోధన చేయాలనుకున్నారు. అలా ఆమె మొదటగా ఎన్టీఆర్‌ను కలవాలని అనుకున్నారు. 


లక్ష్మీపార్వతికి నో చెప్పిన ఎన్టీఆర్‌
ఆమె తన భర్త వీరగంధం వెంకట సుబ్బారావుతో కలిసి 1985లో న్యూఢిల్లీకి వెళ్లి అక్కడ రామారావును కలుసుకున్నారు. తన రీసర్చ్‌తో పాటు ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర రాయడం కోసం సాకారం ఇవ్వాలని లక్ష్మీపార్వతి కోరడంతో ఆయన కుదరదని చెప్పారు. ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉన్నానని లక్ష్మీపార్వతితో  ఎన్టీఆర్‌ చెప్పారు. అలా మొదటిసారి వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

ఆకలితో పడుకున్న ఎన్టీఆర్‌
1993-94లో ఏం జరిగిందో జర్నలిస్ట్‌ దాసు కేశవ రావు ఇలా చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌  ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఒకరోజు పర్యటన ముగించుకుని బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 13న ఎన్టీఆర్‌  నివాసానికి తిరిగి వచ్చాం. అప్పుడు ఆయనతో పాటు నేనూ ఉన్నాను. ఇల్లు దాదాపుగా ఖాళీగా ఉంది. అప్పుడు ఇంట్లో ఒకరిద్దరు పనివాళ్లు మినహాయించి ఎవరూ లేరు. ఆ సమయంలో ఆయన ఆకలితో ఉన్నారు.. కానీ అక్కడ తినటానికి ఏం లేదు. ఎన్టీఆర్‌ ఖాళీ కడుపుతో పడుకోబోతుండగా ఆయన దగ్గర పనిచేస్తున్న ఒకరు ఆ పరిస్థితిని చూసి చలించిపోయి .. ఎన్టీఆర్‌ స్నేహితుడి ఇంటి వద్దకు వెళ్లి అప్పటికప్పడు భోజనం తయారు చేపించుకుని వచ్చి వడ్డించాడు. ఆయన జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటనలలో ఇది ఒకటి. బడి పంతులు సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సమాంతరంగా నిజ జీవితంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి.

కుటుంబ సభ్యులకు దూరం
1984లో తన మొదటి భార్య బసవ తారకం మరణం తర్వాత ఎన్టీఆర్ ఒంటరిగా మిగిలిపోయారు. అప్పటి నుంచి ఆయనకు పనివాళ్లే అన్నం వడ్డించడం వంటివి చేసేవారు. ఆయనకు 7 మంది కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నా కూడా  కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్లూ ఆయన ఉంటున్న ఇంటి వద్దకు వచ్చే వాళ్లు కాదు. ఒంటిరిగానే ఉండేవారు. ఆ సమయంలో అతన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన శ్రద్ధగల భాగస్వామి అవసరం. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో లక్ష్మీపార్వతి 1991-92లో రామారావు జీవితంలోకి ప్రవేశించారు. అప్పటికే ఆమె తన భర్త నుంచి విడిపోయి ఉన్నారు.  

చాలా రోజుల నుంచి తన రీసెర్చ్‌, ఆటో బయోగ్రఫీ కోసం ఆమె పదే పదే అభ్యర్థన చేస్తుండటంతో చివరకు ఎన్టీఆర్ అంగీకరించారు. ఆ సమయంలో (1991-92) ఎన్టీఆర్‌  ప్రతిపక్ష నేతగా ఉండటంతో  ఆమె పరిశోధన, జీవిత చరిత్ర గురించి రాసేందుకు మరింత సులభం అయింది. ఆప్పుడు ఎన్టీఆర్‌కు కూడా   ఎక్కువ సమయం దొరికింది.  పురాణాలు, భారత సంస్కృతిపై లక్ష్మీపార్వతికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణతో ఎన్టీఆర్‌ ఆశ్చర్యపోయారు. అలా రోజూ వారిద్దరూ చర్చిస్తుండటంతో వారిని మరింత దగ్గర చేసింది.  కానీ అప్పట్లో ఆమె నరసరావుపేట తెలుగు విశ్వవిద్యాలయానికి బస్సులో వెళ్లి రావడం ఇబ్బందిగా ఉండటంతో ఎన్టీఆర్ ఆమెకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అలా ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆమె ఉండేందుకు బస కూడా ఏర్పాటు అయింది.


ఆస్పత్రిలో ఎన్టీఆర్‌ ఉంటే..
 ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతి మధ్య అనుబంధం మరింత బలపడటంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. అప్పుడు వారిలో ఎన్టీఆర్‌ పట్ల విపరీతమైన కోపం పెరిగింది. అప్పటికే ఎన్టీఆర్‌కు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు లక్ష్మీపార్వతి ఎంట్రీతో జీర్ణించుకోలేకపోయారు. ఆమెపై ద్వేషం పెంచుకున్నారు. ఒకరోజు రాత్రిపూట ఎన్టీఆర్‌కు రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయాయి. దాదాపు అయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆప్పుడు ఎంతో ఆందోళనలో లక్ష్మీపార్వతి ఉన్నారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. అప్పుడు కూడా కుటుంబ సభ్యులు చూసేందుకు వెళ్ల లేదు. ఆస్పత్రిలో ఎన్టీఆర్‌కు ఆమె ఎనలేని సేవ చేయడం జరిగింది. అలా ఆయన మళ్లీ ఆరోగ్యంగా కోలుకున్నారు.

1993 సెప్టెంబర్ 10న ప్రకటన
ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతి మధ్య ఉన్న సంబంధంపై మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వాళ్ల గురించి పుకార్లు కూడా ప్రారంభం అయ్యాయి. కానీ ఎన్టీఆర్ వాటి పట్ల ఎక్కడా స్పందించలేదు. సరిగ్గా అలాంటి సమయంలోనే మేజర్‌ చంద్రకాంత్‌ సినిమా 100వ రోజు వేడుక తిరుపతిలో జరుగుతుంది. అక్కడ ఈ టాపిక్‌పై స్పందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆయన్ను ఆపేందుకు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు అందురూ ప్రయత్నించారు. కానీ కుదరలేదు.

అది 1993 సెప్టెంబర్ 10 తిరుపతిలో సభ... ఎన్టీఆర్‌ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆ సమయంలో సభకు దూరంగా కూర్చోని ఉన్న  లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్‌ వేదికపైకి పిలిచారు. దాంతో ఆ సమయంలో అక్కడే ఉన్న నారా చంద్రబాబు నాయుడు హుటాహుటిన కిందకు వెళ్లిపోయారు. ఇవన్నీ ఎన్టీఆర్‌ లెక్క చేయలేదు. తమ కుటుంబ సభ్యులు లక్ష్మీ పార్వతిని పలు ఇబ్బందులకు గురిచేశారు. ఆమె గురించి తప్పుగా ప్రచారం చేశారు. 'నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు దూరంగా ఉంటే లక్ష్మీ పార్వతి నాకు అండగా నిలిచింది.' అని ఎన్టీఆర్‌ అన్నారు. ఆమెను వివాహం చేసుకుంటున్నట్లు ఆయన అక్కడే ప్రకటించారు. అలా ఆమెను తన భార్యగా బహిరంగంగానే చాటిచెప్పారు. అంతేకాకుండా 1994 ఎన్నికల ప్రచారం సమయంలో కూడా  ఆమెను తన వెంటే ఉండేలా  చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం, పార్టీ సమావేశాలలో ఎన్టీఆర్‌తో పాటుగా ఆమె కూడా కీలకంగా పనిచేశారు. 

1995 ఎన్టీఆర్‌ పర్యటనతో పతనం
అలా ఎన్నికలు పూర్తి కావడం... తెలుగుదేశం భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. ఆ సమయానికి ఆమె అదృష్టం బాగానే ఉంది. మరోవైపు పార్టీలో చంద్రబాబు నాయుడు పతనం ప్రారంభం అయింది. 1995లో లక్ష్మీ పార్వతితో పాటు ఎన్టీఆర్‌  UK పర్యటనకు వెళ్లారు. అప్పుడు UK పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రిని కలిసేందుకు వెళ్లారు. కానీ వారిద్దరూ ఇండియాకు తిరిగి రావడం కొంత ఆలస్యం అయింది. అదే ఎన్టీఆర్‌ పతనానికి దారి తీసింది.

పావులు కదిపిన చంద్రబాబు
 ఇలాంటి సమయం కోసం చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అప్పుడు చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఆ సమయంలో జరిగిన స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అప్పటి వరకు ఎన్టీఆర్‌కు నమ్మకంగా ఉన్న విధేయుల నుంచి తిరుగుబావుట ఎదురైంది. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలే నడిపించారు.

అలా  1995 ఆగష్టులో రామారావు, లక్ష్మీ పార్వతిలు ఈ సంక్షోభాన్ని పసిగట్టలేకపోయారు.  పార్టీ అధ్యక్షుడి పదవి చంద్రబాబు నాయుడుకు చేరింది. తర్వాత ముఖ్యమంత్రి పదవి వరించింది. అక్కడితో ఎన్టీఆర్‌ చరిత్ర ముగిసిపోయింది. ఆ సమయం నుంచి చంద్రబాబు ఏది చెబితే అదే జరుగుతూ వచ్చింది. ఆ విధంగా, లక్ష్మీ పార్వతి కూడా తన భర్తతో పాటుగా ఉన్నత స్థానం నుంచి కిందకు పడిపోయారు. అలా కొన్ని నెలల తరువాత  (1996) ఎన్టీఆర్‌ మరణించడం జరిగిపోయింది. అలా ఎన్టీఆర్‌ చివరి రోజులు క్షోభ,వేదనతో ముగిసిపోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement