బాలీవుడ్ నటి, పర్యావరణ ప్రేమికురాలు భూమి పడ్నేకర్ ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్న వివక్షపై అసహనం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి ఆడ, మగ అని తేడా లేకుండా అందరినీ ఇబ్బందులకు గురి చేసిందని, కానీ వీటికి తోడు ఆడవారికి మరిన్ని సమస్యలు తప్పలేవని చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో నిర్మాతలు ఆడవాళ్ల పారితోషికం కట్ చేసి ఇచ్చేవారని, కానీ మగవారికి మాత్రం అలాంటి కోతలేమీ లేకుండా ఎప్పటిలాగే రెమ్యునరేషన్ అందజేసేవారని తెలిపింది.
'కోవిడ్ పరిస్థితిని అర్థం చేసుకొని పారితోషికం తగ్గించుకోమని ఏ నిర్మాత కూడా హీరో దగ్గరకు వెళ్లి అడిగిన దాఖలాలు లేవు. కానీ అదే ఇండస్ట్రీలో ఉన్న మాలాంటి మహిళల దగ్గరకు వచ్చి మాత్రం రెమ్యునరేషన్‌లో కొంత కోత పెట్టాల్సిందేనని చెప్తుంటారు. హీరోల జోలికి వెళ్లరు కానీ హీరోయిన్లనే బలి చేస్తారు. చాలా హాస్యాస్పదంగా ఉంది' అని విమర్శించింది భూమి. ఇదిలా ఉంటే ఆమె నటించిన 'బదాయి దో' సినిమా గతవారం రిలీజై బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తోంది. రిలీజైన వారం రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర సుమారు 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment