ఆర్య.. లేడీ కమెడియన్. బడాయి బంగ్లా అనే కామెడీ షోతో తన పేరు కాస్తా ఆర్య బడాయిగా మారిపోయింది. నటిగా, హాస్య నటిగా, యాంకర్‌గా, జడ్జిగా ఇలా వివిధ పాత్రలు పోషించే ఆమె సినిమాలు, రియాలిటీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. అందరినీ కడుపుబ్బా నవ్వించే ఆర్య జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. 2008లో ఐటీ ఇంజనీర్ రోహిత్ సుశీలన్ (నటి అర్చన సుశీలన్ సోదరుడు)ను పెళ్లాడగా వీరికి రోయ అనే కూతురు పుట్టింది. కూతురి పేరు మీద ఓ బొటిక్ కూడా ఓపెన్ చేసింది. అయితే ఏమైందో ఏమో కానీ 2019లో భర్తతో విడిపోయి కూతురితో ఒంటరిగా నివసిస్తోంది.
బిగ్‌బాస్ తర్వాత డిప్రెషన్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధను బయటపెట్టింది. బిగ్‌బాస్ నుంచి వచ్చాక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడలేకపోయాను. చనిపోయేందుకు ప్రయత్నించాను. నిద్రమాత్రలు తీసుకున్నాను. కానీ నా కూతురిని చూసి ఆగిపోయాను. తనే నన్ను ఆ బాధలో నుంచి బయటపడేసింది. ఎప్పుడైనా సరే మనకు తట్టుకోలేనంత బాధ అనిపిస్తే దాన్నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తాం. చావు ఒక్కటే మార్గం అనుకుంటాం.
మరణమే మార్గమనుకున్నా
లాక్‌డౌన్‌లో నాకూ అలాంటి పరిస్థితే ఎదురైంది. మాట్లాడేందుకు కూడా ఎవరూ లేరు. చావే సరైన నిర్ణయమనుకున్నాను. కానీ నా కూతురు.. తన పరిస్థితి ఏం కావాలి? తనను చూసుకోవడానికి మా నాన్న కూడా లేరు. ఆయన ఉండుంటే కూతుర్ని ఆయన చూసుకుంటాడన్న ధీమాతో ఎప్పుడో ప్రాణాలు వదిలేసేదాన్ని. నేను, అమ్మ, వదిన, పాప.. వాళ్లకంటూ ఉన్నది నేనేగా! అందరినీ వదిలేసిపోతే వాళ్లుం ఏం చేస్తారు? నా కూతురు జీవితం ఏమైపోతుంది? పాపను తన తండ్రి బాగానే చూసుకుంటాడు.
కూతురి కోసం ఆలోచించి ఆగిపోయా
కానీ చుట్టూ ఉన్న సమాజం ప్రేమలో ఓడిపోయి మీ అమ్మ బలవన్మరణానికి పాల్పడిందంటూ కాకుల్లా పొడిచి మరీ చెప్తారు. అవన్నీ ఆలోచించి ఆగిపోయాను. నా కుటుంబంతో, ఫ్రెండ్స్‌తో మాట్లాడాను. మళ్లీ సరైన దారిలోకి వచ్చాను. పెళ్లి విఫలమవడాన్ని భరించాను, తర్వాత బ్రేకప్ బాధనూ తట్టుకున్నాను, ఆఖరికి నాన్న మరణాన్ని సైతం తట్టుకుని నిలబడ్డాను. అందుకే అందరూ నన్ను బోల్డ్ అని పిలుస్తుంటారు. కానీ నేను చాలా ఎమోషనల్.. అని ఆర్య చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment