బిగ్‌బాస్‌ హౌస్‌కు నేనే హీరోయిన్‌: హమీదా | Bigg Boss Telugu 5 Dussehra Special Full Episode | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: హమీదా ఎలిమినేట్‌, షాక్‌లో శ్రీరామ్‌

Published Sun, Oct 10 2021 6:24 PM | Last Updated on Sun, Oct 10 2021 9:46 PM

Bigg Boss Telugu 5 Dussehra Special Full Episode - Sakshi

Bigg Boss Telugu 5: నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌లో భాగంగా నాగ్‌ సాంప్రదాయ పంచెకట్టులో మెరిసిపోయాడు. అటు కంటెస్టెంట్లు కూడా పోటీపడి మరీ అలంకరించుకున్నట్లు కనిపిస్తోంది. సండేను స్పెషల్‌డేగా మార్చేందుకు స్టేజీ మీదకు విచ్చేసిన నాగ్‌.. మగాళ్లందరూ బంగార్రాజులాగా, ఆడాళ్లందరూ సత్యభామల్లా ఉన్నారంటూ కంటెస్టెంట్ల మీద పొగడ్తల వర్షం కురిపించాడు. నవరాత్రి సందర్భంగా 9 గేమ్స్‌, 9 అవార్డులు ఇవ్వబోతున్నట్లు వెల్లడించాడు.

గెలిచిన రవి టీమ్‌
ఇందులో భాగంగా A టీమ్‌లో రవి, హమీదా, శ్వేత, సన్నీ, షణ్ముఖ్‌, ప్రియాంక, లోబో, యానీ ఉండగా మిగిలినవారు B టీమ్‌లో ఉంటారు. మొదటగా వీరిద్దరికీ మధ్య రింగ్‌ ఫైట్‌ పెట్టారు. ఇందులో సన్నీ, సిరి గెలవడంతో వారికి ఫ్యామిలీ వీడియో చూపించారు. లోబో తన కూతురు మాట్లాడిన వీడియో చూడగానే వెక్కివెక్కి ఏడ్చాడు. తర్వాత జెస్సీ తల్లి అతడికి ధైర్యం నూరిపోసిన మాటలను చూపించగా అతడు తెగ సంతోషపడ్డాడు. తర్వాత రెండు టీమ్‌లు చెరో స్కిట్‌తో మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఈ గేమ్‌లో రవి టీమ్‌ గెలవగా అతడు మరోసారి పాలపిట్ట అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడి టీమ్‌లోని యానీ మాస్టర్‌కు ఆమె తల్లి మాట్లాడిన వీడియో చూపించారు. దీంతో కొరియోగ్రాఫర్‌.. ఉద్వేగానికి లోనైంది. అనంతరం హెబ్బా పటేల్‌.. నా తప్పు ఏమున్నదబ్బా అంటూ.. డ్యాన్స్‌తో హుషారెత్తించింది.

కాజల్‌కు కాకరకాయ, ప్రియకు ఉల్లిపాయ
తర్వాత కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్‌ డబ్బాలు పంపించాడు. ఎవరికి ఎక్కువ స్వీట్లు వస్తే వారే గెలిచినట్లు అని చెప్పాడు. ఈ టాస్క్‌లో కాజల్‌కు కాకరకాయ, ప్రియకు ఉల్లిపాయ రావడం గమనార్హం. ​కానీ రవి టీమ్‌లోని హమీదాకు పూతరేకులు, పింకీ, షణ్ముఖ్‌లకు స్వీట్లు రావడంతో A టీమ్‌ గెలవగా మరోసారి వారు పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయారు. ఈ సందర్భంగా యాంకర్‌ రవి భార్య, కూతురు మాట్లాడిన వీడియో ప్లే చేయడంతో అతడు ఎమోషనల్‌ అయ్యాడు.

స్పెషల్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న సంధ్యారాణి
తర్వాత నాగార్జున రెండు టీములను చెరో 5 ప్రశ్నలు అడిగాడు. ఈ గేమ్‌లో ఎక్కువ సమాధానాలు చెప్పి ప్రియ టీమ్‌ గెలవడంతో ఆమె టీమ్‌లోని విశ్వకు అతడి ఫ్యామిలీ మాట్లాడిన వీడియో చూపించారు. అందులో విశ్వ భార్య మాట్లాడుతూ.. ఏదున్నా మసులో పెట్టుకోకని సూచించింది. నాట్యం సినిమా కథానాయిక సంధ్యారాణి తన స్పెషల్‌ పర్ఫామెన్స్‌తో అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

ఉర్రూతలూగించిన మంగ్లీ
అనంతరం కడవ మీద కడవ ఎత్తుకుని నడిచే టాస్కులో కాజల్‌ గెలిచింది. దీంతో ఆమె సభ్యురాలిగా ఉన్న B టీమ్‌కు పాలపిట్ట అవార్డు రాగా ప్రియకు ఆమె కుమారుడు మాట్లాడిన వీడియో చూపించారు. తర్వాత హౌస్‌మేట్స్‌ బతుకమ్మ పేర్చి ఆడారు. బతుకమ్మ అందంగా పేర్చి ప్రియ టీమ్‌ గెలిచి పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయింది. దీంతో కాజల్‌కు ఆమె కూతురు మాట్లాడిన వీడియో చూపించారు. అటు మంగ్లీ మాస్‌ పాటలు పాడి తన గాత్రంతో అందరినీ ఓ ఊపు ఊపేసింది.

జెస్సీని, సిరిని కాపాడటానికే షణ్ముఖ్‌ పుట్టాడు..
తర్వాత వచ్చిన హైపర్‌ ఆది కంటెస్టెంట్లు అందరినీ చెడుగుడు ఆడేశాడు. హమీదా వాకిట్లో శ్రీరామ్‌ చెట్టు అనే ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్నారంటూ వాళ్లిద్దరి మీద జోకేశాడు ఆది. నాగ్‌ తాకిన షర్ట్‌ను అంత అపురూపంగా చూసుకున్నావు, మరి నన్ను హగ్‌ చేసుకున్నారు. నన్నేం చేస్తావంటూ పంచ్‌ వేశాడు. జెస్సీని, సిరిని కాపాడటానికే షణ్ముఖ్‌ పుట్టాడని కౌంటరిచ్చాడు. ఈ ముగ్గురు మిగతావాళ్లతో కూడా కలిసి ఆడితే బాగుంటుందని సెలవిచ్చాడు. స్విమ్మింగ్‌పూల్‌లో ఎక్కువ సేపు మునగాలన్న టాస్క్‌లో B టీమ్‌ నుంచి విశ్వ గెలిచింది. దీంతో అదే టీమ్‌లోని సిరికి ఆమె మాట్లాడిన వీడియో చూపించారు.

ప్రియ గెలిచింది 6, రవి గెలిచింది 2
తర్వాత బొమ్మను అందంగా ముస్తాబు చేయాల్సిన టాస్క్‌లో ప్రియ టీమ్‌ గెలిచి మరోసారి పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయింది. దీంతో ఆ టీమ్‌లోని హమీదాకు ఆమె ఫ్యామిలీ మాట్లాడిన వీడియో చూపించారు. ట్రోఫీ తీసుకొచ్చేయ్‌ అక్కా.. అంటూ ఆమె తమ్ముడు మాట్లాడిన మాటలు విని హమీదా కంటతడి పెట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన 8 గేముల్లో ప్రియ 6 గెలవగా రవి 2 గెలిచాడు. తర్వాత స్టేజీ మీద సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ టీమ్‌. హీరో అఖిల్‌.. తనతో పాటు తీసుకొచ్చిన పూజా హెగ్డేను ఇంప్రెస్‌ చేయమని ఇంట్లోని మగవాళ్లకు టాస్క్‌ ఇచ్చాడు. 

దీంతో శ్రీరామ్‌ పాట పాడగా, సన్నీ మిమిక్రీ చేశాడు. షణ్ముఖ్‌ మాత్రం సింగిల్స్‌ కోసం స్కిట్‌ వేశాడు. జెస్సీ, మానస్‌ డ్యాన్స్‌తో పడగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ పూజా మాత్రం.. తను అఖిల్‌కే పడిపోయానని చెప్పింది. అయితే ఈ గేమ్‌లో మానస్‌ గెలిచాడని తెలిపాడు నాగ్‌. దీంతో మానస్‌కు ఫ్యామిలీ వీడియో చూపించారు. తర్వాత షణ్ముఖ్‌ సేవ్‌ అయినట్లు ప్రకటించారు. చివరగా విశ్వ, హమీదా మిగలగా... వీరిలో నుంచి హమీదా ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. హౌస్‌కు తానే హీరోయిన్‌ అని చెప్పుకొచ్చింది హమీదా.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement