
మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఉమెన్స్ పేరుతో మెగాస్టార్ ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. చిరంజీవి అమ్మగారు అంజనాదేవితో పాటు ఆయన సోదరీమణులు, సోదరుడు నాగబాబుతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి జీవితంలో జరిగిన అనేక సంఘటనలతో పాటు పలు సరదా విషయాలను వారు పంచుకున్నారు. అయితే, చిరు సోదరీమణులలో మాధవి రావు కూడా ఈ ఇంటర్వ్యూలో కనిపించడం విశేషం. వాస్తవంగా ఆమె మీడియాకు చాలా దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే.
మెగా బ్రదర్స్‌తో పాటు ఇద్దరు సోదరీమణులు ప్రస్తుతం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాము మొత్తం ఏనిమిది మంది అని చిరంజీవి తెలిపారు. చిన్న వయసులోనే తన సోదర,సోదరీమణులు ముగ్గురు చనిపోయారని ఆ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'అమ్మకు మేము ఐదుగురు బిడ్డలం. అయితే, మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. నేనే ఆరో తరగతి చదువుతున్నప్పుడు రమా అని నాకొక సోదరి ఉండేది. నాగబాబు, కల్యాణ్‌ల కంటే పెద్దది. చిన్న వయసులోనే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఒకరోజు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో పోన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి అమ్మ, నేను కలిసి తీసుకువెళ్లాం. రెండురోజుల తర్వాత రమా చనిపోయింది.
ఆ బిడ్డ శవాన్ని నా భుజాల మీద పెట్టుకొని రిక్షాలో అమ్మతో పాటు ఇంటికి వచ్చాను. ఆ దృశ్యాలు ఇప్పటికీ నన్ను కలిచివేస్తుంటాయి. నాన్న ఉద్యోగరీత్యా అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ఆయనకు ఎలా తెలపాలో కూడా మాకు తెలియలేదు. ఎదోలా తెలిసిన వారి ద్వారా విషయాన్ని నాన్నకు చేరవేశాం. ఇంతలో చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడంతో అంత్యక్రియలు పూర్తిచేశాం. ఆపై నాన్న వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ రోజు జరిగిన ప్రతి క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. అది తలుచుకున్న ప్రతిసారి చాలా బాధగా ఉంటుంది.' అని చిరు కంటతడితో ఈ మాటలు చెప్పారు.