స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి టైటిల్ రోల్ చేసిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. రామ్‌చరణ్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది. భారీ బడ్జెట్‌లో తెరెక్కిన ఈ చిత్రాన్ని సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేశారు. రాజకీయాల తర్వాత చిరు 'ఖైదీ నంబర్ 150'తో ప్రేక్షకుల ముందుకు రీ ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత భారీ అంచనాలతో ‘సైరా’ 2019లో విడుదలైంది.
కొణిదెల ప్రొడక్షన్‌లో రూ. 200 కోట్లతో సైరాను నిర్మించారు రామ్ చరణ్. అంత బడ్జెట్‌తో సినిమా అంటే కష్టం అనిపించినా.. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఖర్చులో ఏమాత్రం రాజీ పడకుండా సైరాను నిర్మించారు. సినిమా పరంగా మంచి టాక్ వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల హిట్ టాక్ వచ్చింది. కానీ కొన్ని చోట్ల నష్టాలు వచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది.
తాజాగా ఓ ఇంటర్వ్యలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సైరా సినిమా నష్టాలు మిగిల్చినట్లు అంగీకరించారు. ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో 'సైరా' గురించి చిరంజీవి ఇలా వ్యాఖ్యానించారు. ' ఇన్నేళ్ల నా సినిమా జీవితంలో ఎన్నో పాత్రలు వేశాను, చాలా సినిమాల్లో నటించాను. కానీ వాటిలో కొన్ని సంతృప్తి ఇవ్వలేదు. పలాన పాత్ర చేయాలని ఎదురు చూస్తే ప్రతిసారీ మనకు రావు. ఈ క్రమంలో స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలనే కోరిక నాలో చాలా ఏళ్లుగా ఉండేది. ఫైనల్లీ 'సైరా'తో అది తీరిపోయింది.
అయితే, ఆ సినిమా నేను అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతగా మెప్పించలేదు. కానీ మిగిలన రాష్ట్రాల్లో బాగానే ఆడింది. దీంతో సైరా వల్ల భారీగానే నష్టపోయాం. గతంలో కూడా 'రుద్రవీణ' సినిమా చేశాను. ఈ సినిమాను నా తమ్ముడు నాగబాబు నిర్మించాడు. సినిమాకు మంచి పేరు వచ్చింది కానీ డబ్బులు మాత్రం రాలేదు. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే నిర్మాత జేబు ఖాళీ అవుతుంది. అందువల్లే వారి బాగు కోసం కమర్షియల్ సినిమాలనే ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది.' అని మెగాస్టార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment