తమిళసినిమా: పాత్రలకు జీవం పోయడానికి ఎంతవరకైనా వెళ్లే నటుడు విక్రమ్. వైవిధ్యభరిత కథా చిత్రాల కోసం తపించే ఈయన తాజాగా నటించిన చిత్రం కోబ్రా. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో 7 స్క్రీన్ పతాకంపై ఎస్‌ఎస్ లలిత్‌కుమార్ నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలోని వీఆర్ మాల్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో పాల్గొన్న నటుడు విక్రమ్ వారసుడు, నటుడు ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ.. తన తండ్రి విక్రమ్ నుంచి చాలా విషయాలు గ్రహించినట్లు చెప్పారు. కోబ్రా చిత్రం పెద్ద హిట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం విక్రమ్ మాట్లాడుతూ.. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఇంతకు ముందు డిమాంటీ కాలనీ, ఇమైకా నొడిగళ్ చిత్రాలను ఒక్కో జానర్‌లో తెరకెక్కించారన్నారు. ఈ కోబ్రా చిత్రాన్ని తనదైన శైలిలో వైవిధ్యంగా తెరపై ఆవిష్కరించారని తెలిపారు.
చిత్ర పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతుండటంతో ఆయన కార్యక్రమంలో పాల్గొనలేకపోయారన్నారు. ఈయన కల్పన కథకు తామంతా సహకరించామని పేర్కొన్నారు. తాను నటించిన చిత్రాలు థియేటర్లలో విడుదలై మూడేళ్లు అయ్యిందన్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల తిరుచ్చి, మదురై, కోయంబత్తూర్ తిరిగొచ్చామని తెలిపారు. అభిమానులు తనపై చూపుతున్న అభిమానం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి తూత్తుక్కుడి, తిరునెల్వెల్లి ప్రాంతాల్లో చిత్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోబ్రా చిత్రం కోసం చాలా శ్రమించామని, ఈ నెల 31వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని విక్రమ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment