అత్యున్నత పురస్కారం: తలైవా భావోద్వేగం | Dadasaheb Phalke Award 2020: Rajinikanth Heartfelt note | Sakshi
Sakshi News home page

అత్యున్నత పురస్కారం: తలైవా భావోద్వేగం

Published Thu, Apr 1 2021 4:30 PM | Last Updated on Thu, Apr 1 2021 6:04 PM

Dadasaheb Phalke Award 2020: Rajinikanth Heartfelt note - Sakshi

సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్రం  ప్రకటించిన  నేపథ్యంలో  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్  స్పందించారు.  2020 సంవత్సరానికిగాను తనను అ‍త్యుత్తమ పురస్కారానికి ఎంపిక చేయడంపై తలైవా సంతోషం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా తనగురువు, సోదరుడుతోపాటు సినీ పరిశ్రమలోని పెద్దా చిన్నా, కేంద్ర, రాష్ట్ర రాజకీయ నేతలతోపాటు, స్నేహితులు, అభిమానులు అందరికీ పేరు పేరునా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  (రజనీకాంత్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు)

ముఖ్యంగా తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకుగాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, జ్యూరికీ కృతజ‍్ఞతలు తెలిపారు. అలాగే తన స్నేహితుడు రాజ్‌ బహదూర్‌, తనలోని నటనా నైపుణ్యాన్ని గుర్తించిన బస్‌ డ్రైవర్‌, తన ఉన్నతికి కారణమైన సోదరుడు రావు గైక్వాడ్‌తో పాటు తనను రజనీకాంత్‌గా సినీ పరిశ్రమకు పరిచయం చేసిన గురువు కే బాలచందర్‌ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు తన దర‍్శకులు,నిర్మాతలు, టెక్నీషియన్లు, మీడియాకు, తమిళ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ  అవార్డు అంకితమని రజనీ ‌ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అలాగే ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్‌, తన సహ నటుడు కమల్‌హాసన్‌, ఇతర రాజకీయ నాయకులు, హితులు, సన్నిహితులందరికీ ఆయన స్పెషల్‌ థ్యాంక్స్‌  చెప్పారు. 

కాగా భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతీసంవత్సరం ఇచ్చే పురస్కారాన్ని రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రజనీకి ఈ అవార్డును ఇవ్వాలన్న జ్యూరీ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించిందని కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో  సినీ, రాజకీయ, ఇతర రంగ ప్రముఖుల నుంచి ఆయనకు అభినందనల వెల్లువ కురుస్తోంది. భారతీయ సినిమా పితామహుడుగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో 1963లో ఈ అవార్డును ప్రారంభించారు. అయితే  దివంగత పాపులర్‌ నటుడు శివాజీ గణేషన్, దర్శకుడు కె.బాలచందర్ తర్వాత ఈప్రతిష్టాత్మక అవార్డును పొందిన తమిళ సినీ రంగానికి చెందిన మూడవ  వ్యక్తిగా రజనీకాంత్‌ నిలిచారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement