Dead Pixels Web Series Review In Telugu - Sakshi
Sakshi News home page

Dead Pixels Review: నిహారిక నటించిన ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉందంటే..

Published Sat, May 20 2023 10:16 AM | Last Updated on Sat, May 20 2023 11:22 AM

Dead Pixels Web Series Review In Telugu - Sakshi

టైటిల్‌ : డెడ్ పిక్సెల్స్
నటీనటులు : నిహారికా కొణిదెల, అక్షయ్ లగుసాని, వైవా హర్ష, సాయి రోనక్, భావనా సాగి, రాజీవ్ కనకాల తదితరులు
నిర్మాతలు : సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్రా, రాహుల్ తమడా  
కథ : అక్షయ్ పూల్ల
దర్శకత్వం: ఆదిత్య మండల 
సంగీతం : సిద్ధార్థ సదాశివుని 
సినిమాటోగ్రఫీ : ఫహాద్ అబ్దుల్ మజీద్
విడుదల తేది: మే 19, 2023(6 ఎపిసోడ్స్‌)
ఓటీటీ ఫ్లాట్‌పామ్‌: డిస్నీ +హాట్‌స్టార్‌

నాలుగేళ్ల విరామం తర్వాత మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నటించిన వెబ్‌ సిరీస్‌ ‘డెడ్‌ పిక్సెల్స్‌’. సాయి రోనక్,  వైవా హర్ష, అక్షయ్ లగుసాని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. 6 ఎపిసోడ్స్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ +హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ వెబ్‌ సిరిస్‌ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

‘డెడ్‌ పిక్సెల్స్‌’ కథేంటంటే.. 
గాయత్రి(నిహారిక కొణిదెల), భార్గవ్(అక్షయ్ లగుసాని), ఐశ్వర్య(భావన సాగి) ముగ్గురూ మంచి స్నేహితులు. ఒకే ఫ్లాట్‌లో ఉంటారు. వీరిలో గాయత్రి, భార్గవ్‌కి ఆన్‌లైన్‌ గేమ్స్‌ అంటే చాలా ఇష్టం. ఖాలీ సమయంలో మాత్రమే కాదు ఆఫీస్‌ టైమ్‌లో కూడా ఆన్‌లైన్‌లో ‘బ్యాటిల్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ అనే వీడియో గేమ్‌ ఆడుతుంటారు. విరిద్దరికి ఆ గేమ్‌ ద్వారలే పైలట్‌ ఆనంద్‌(వైవా హర్ష) పరిచయం అవుతాడు.

(చదవండి: బిచ్చగాడు మూవీ 2 రివ్యూ)

ఈ ముగ్గురికి ఆ గేమ్‌ తప్ప మరో ప్రపంచం ఉండదు. ఆనంద్‌ అయితే భార్య, పిల్లల్ని పట్టించుకోకుండా గేమ్‌కే అడిక్ట్‌ అవుతాడు. ఈ ఆన్‌లైన్‌ గేమ్‌.. ఆ ముగ్గురిపై ఎలాంటి ప్రభావం చూపింది? గాయత్రికి ఆఫీసులో పరిచమైన రోషన్‌(సాయి రోణక్‌)  కారణంగా ఆటలోనూ, నిజ జీవితంలోనూ భార్తవ్‌కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తండ్రి(రాజీవ్‌ కనకాల)తో భార్గవ్‌కు ఉన్న సమస్య ఏంటి? ‘బ్యాటిల్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ గేమ్‌కి అడిక్ట్‌ అయిన తన స్నేహితులను రియాల్టీలోకి తీసుకురావడానికి ఐశ్వర్య ఏం చేసింది? చివరకు ఏం అయింది? అనేది డిస్నీ +హాట్‌స్టార్‌లో డెడ్‌ పిక్సెల్స్‌ వెబ్‌ సిరీస్‌ చూసి తెలుసుకోవాలి. 

ఎలా ఉందంటే.. 
ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసలై చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అలాంటి గేమ్స్‌కి అడిక్ట్‌ అయితే జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనేది కామెడీ వేలో డెడ్‌ పిక్సెల్స్‌ వెబ్‌ సిరీస్‌ ద్వారా చూపించారు. దర్శక, రచయితలు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ.. దానిని  తెరపై చూపించడంలో కాస్త తడబడ్డారు. కథను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది.

వీడియో గేమర్సే టార్గెట్‌గా ఈ వెబ్‌ సిరీస్‌ని తెరకెక్కించారు.ఇందులో ఐశ్వర్య తప్ప మిగిలిన మూడు క్యారెక్టర్స్‌ వాస్తవ ప్రపంచంలో ఉండవు. యువతే కాదు పెద్దలు కూడా ఇలాంటి ఆటలకు బానిసలైపోతున్నారని వైవా హర్ష ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. భార్య పిల్లన్ని పట్టించుకోకపోతే జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయనేది అతని పాత్ర ద్వారా తెలియజేశారు. రియాలిటీకి, ఆన్‌లైన్‌లో బతకడానికి మధ్య తేడా ఏంటో ఐశ్వర్య పాత్ర ద్వారా చూపించారు. 

గేమ్‌ ఆడేటప్పుడు  నిహారిక, సాయి రోనక్‌, వైవా హర్ష, అక్షయ్‌ల మధ్య జరిగే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. సిరీస్‌ మొత్తం ఇలానే కామెడీగా తెరకెక్కించినా బాగుండేది. మధ్యలో పేరెంట్స్‌ని కోల్పోయిన ఓ కుర్రాడిని, ఆన్‌లైన్‌ బాయ్‌కాట్‌ లాంటి సన్నివేశాలను ఇరికించారు. అవి అంతగా ఆకట్టుకోలేవు. గేమ్‌ ద్వారా నిహారిక, భార్గవ్‌ పాత్రలు చేసే రొమాంటిక్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అక్షయ్, నిహారిక, సాయి రోణక్ మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీని మరింత ఆసక్తిగా చూపిస్తే బాగుండేది. ఇక ఆన్‌లైన్‌ గేమ్‌ల కంటే మైదానంలో ఆడే ఆటలు చాలా గొప్పవని రాజీవ్‌ కనకాల పాత్ర ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పాత్ర నిడివిని పెంచి ఆన్‌లైన్‌లో ఆడే ఆటలకు, రియల్‌గా ఆడే ఆటలకు మధ్య తేడాలను చూపించే విధంగా కొన్ని సన్నివేశాలను యాడ్‌ చేస్తే.. మంచి సందేశం ఇచ్చినట్లు ఉండేది.వీడియో గేమ్స్ ఇష్టపడే వారికి ఈ వెబ్‌ సిరీస్‌ బాగా కనెక్ట్‌ అవుతుంది. 

ఎవరెలా చేశారంటే..
గాయత్రి పాత్రలో నిహారిక ఒదిగిపోయింది. తనకు నచ్చినట్టుగా బతికే పాత్ర అది. అర్బన్ గర్ల్‌గా నిహారిక బాడీ లాంగ్వేజ్, నటన ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక గాయత్రి ఫ్లాట్‌మేట్స్‌ భార్గవ్‌, ఐశ్వర్యలుగా  అక్షయ్ లగుసాని, భావన సాగి తమ పాత్రలకు న్యాయం చేశారు. నిహారిక, అక్షయ్‌ల పాత్రలు ఆన్‌ గేమ్‌కి అడిక్ట్‌ అయితే.. వారికి హితబోధ చేస్తూ రియాల్టీలో బతికే పాత్ర భావన సాగిది. చూడడానికి అందంగా ఉండి, కాస్త తెలివితక్కువ యువకుడు రోషన్‌గా సాయి రోణక్‌ తనదైన నటనతో ఆకట్టకున్నాడు. భార్య పిలల్ని వదిలేసి ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసైన పైలట్‌ ఆనంద్‌గా వైవా హర్ష మెప్పించాడు. ఇక సాంకేతిక పరంగా ఈ సిరిస్‌ పర్వాలేదనిపిస్తుంది. వరుస వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తూ విజయవంతంగా దూసుకెళ్తున్న తమడా మీడియా ప్రై.లి బ్యానర్‌ ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ వెబ్‌ సిరీస్‌ని నిర్మించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement