సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
అయితే టాలీవుడ్‌లో రజినీకాంత్‌కు ఫ్యాన్ బేస్ ఓ రేంజ్‌లో ఉంది. దీంతో టాలీవుడ్‌లోనూ వెట్టైయాన్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అందులో తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై అప్పుడే నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. వెట్టైయాన్ డిజాస్టర్ అంటూ నెగెటివ్ ట్రోలింగ్ మొదలెట్టారు. మరోవైపు తెలుగులో ఈ మూవీని ఏషియన్, దిల్‌రాజు సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో తమిళ టైటిల్ ఉండడంపై సోషల్ మీడియాలో చర్చ జరగడంపై ఆయన స్పందించారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. 'పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు కొన్ని టైటిల్ విషయంలో సమస్యలు ఉంటాయి. గేమ్ ఛేంజర్ విషయలో కూడా రెండు, మూడు భాషల్లో ఇబ్బంది ఎదురైంది. సోషల్ మీడియాలో రజనీకాంత్ వెట్టాయన్ బాయ్ కాట్ ట్రెండింగ్ చేస్తున్నారు. అలాగే వెట్టయాన్ అనే టైటిల్ తెలుగులో కాంట్రవర్సీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా గ్లోబల్ అయిపోయింది. సాధ్యమైనంత వరకు టైటిల్స్ లోకల్ పేరుతో పెడుతున్నారు. లేని పక్షంలో అదే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. సినిమాని సినిమాగా చూడండి' అని అన్నారు.
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ …'తెలుగులో చాలా డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమాలు కూడా చాలా ఇతర భాషల్లో డబ్ అవుతున్నాయి. వన్ ఇండియా వన్ నేషన్ అంటున్నారు కదా. తెలుగు వెట్టయాన్ అందరూ వచ్చి చూడండి' అని అన్నారు. దగ్గుబాటి రానా మాట్లాడుతూ … 'రజినీకాంత్ సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుంది. డైరెక్టర్ మీద ఇష్టంతో ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ నటించారు. ఈ రోజు మన తెలుగు సినిమాని ప్రపంచం మొత్తం చూస్తోంది. ట్రోల్స్ అనేవి టైం పాస్ లాంటివని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment