సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణంపై కాంగ్రెస్ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె దిలీప్ కుమార్ భార్య సైరా బానుకు ఒక లేఖ రాశారు. "మీ ప్రియమైన భర్త దిలీప్ కుమార్ కన్నుమూతతో, భారతీయ సినిమా చరిత్రలో ఒక స్వర్ణయుగం ముగిసింది’’ అని సైరా బానుకు గురువారం రాసిన సంతాప సందేశంలో సోనియా పేర్కొన్నారు.
దిలీప్ కుమార్ ఒక లెజెండ్..భవిష్యత్తులో కూడా లెజెండ్‌గానే కొనసాగుతారు.ఎందుకంటే భవిష్యత్తరం సినీ ప్రేమికులు కూడా ఆయన అద్భుతమైన నటనా వైభవాన్ని ఆస్వాదిస్తాయి. ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీలను అందించిన ఆయన నటనా నైపుణ్యాన్ని ఆరాధిస్తారంటూ ఆయన సాధించిన ఘనతను, విజయాలను గుర్తుచేసుకున్నారు. అలాగే గంగా జమునా, డాగ్, దీదార్, మొఘల్-ఏ-ఆజం, నయా దౌర్, మధుమతి, దేవదాస్,రామ్ ఔర్ శ్యామ్ లాంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో తన పాత్రలతో అలరించిన ఆయన నటను ఎవరు మరచిపోగలమని వ్యాఖ్యానించారు..పూర్తికాల జీవితాన్ని అనుభవించిన దిలీప్ కుమార్ అమూల్యమైన వారసత్వాన్ని ప్రపంచ సినిమాకు అందించారని కొనియాడారు. ఆయన మరణం విశేష అభిమానులను దుఃఖ సాగరంలో ముంచేసిందనీ, దేశం ఎప్పటికీ ఆయనను గుర్తు పెట్టుకుంటుందనీ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అలాగే ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని,ధైర్యాన్ని మీకివ్వాలని ప్రార్థిస్తున్నానని సోనియా తన లేఖలో పేర్కొన్నారు.
కాగా వయసు సంబంధిత సమస్యలతో దిలీప్ కుమార్ ముంబై ఆసుపత్రిలో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా 'కోహినూర్' గా భావించే మొహమ్మద్ యూసుఫ్ ఖాన్, స్క్రీన్ పేరు దిలీప్ కుమార్‌గా ప్రపంచానికి సుపరిచితుడు. 1966లో ఆయన సైరా బానును వివాహమాడారు.
Comments
Please login to add a commentAdd a comment