
‘‘తండేల్’ సినిమా షూట్ అప్పుడు ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుందనే ఆలోచన మా యూనిట్‌కి లేదు. కానీ ఈ చిత్రం మా అందరికీ మంచి గౌరవాన్ని తీసుకొస్తుందని బలంగా నమ్మాం. ప్రేక్షకులు అంతే గౌరవంతో గొప్ప ఘన విజయాన్ని ఇచ్చారు. మా నమ్మకాన్ని ‘తండేల్’ నిలబెట్టింది.
అలాగే కలెక్షన్లలో వంద కోట్లకు చేరువ కావడం సంతోషంగా ఉంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి(Chandoo Mondeti)తెలిపారు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం‘తండేల్’(Thandel Movie). చందు మొండేటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం చందు మొండేటి పంచుకున్న విశేషాలు.
⇒ పాకిస్తాన్ వాళ్లు మన తెలుగు సినిమాలు చూస్తారు. అక్కడి జైలులో ఒక సెంట్రీ అల్లు అర్జున్‌గారి ఫ్యాన్. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుంది అంటూ అక్కడ ఖైదీలుగా ఉన్న మన 22 మంది మత్య్సకారులతో ఆ సెంట్రీ అన్నారట. ఈ విషయాన్ని ఆ 22 మంది నాతో చెప్పారు. ‘తండేల్’ బయోపిక్ కాదు. వాస్తవిక ఘటనలతో కూడుకున్న కాల్పనిక ప్రేమకథ. అందుకే పాత్రలకి రియల్ పేర్లు పెట్టలేదు.
⇒ ‘తండేల్’ కథని తొలిసారి విన్నప్పుడు పాక్ నేపథ్యంలో చేద్దామనుకున్నాను. కానీ, కథలో అందమైన భావోద్వేగం ఉంది. అలాగే ప్రేమకథలో ఎడబాటు, విరహం చాలా ప్రత్యేకం. ఇద్దరు ప్రేమికులు ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయాలంటే నెల రోజులు ఆగాలి. ఈ పాయింట్ నాకు బాగా అనిపించింది. అందుకే ఈ చిత్రాన్ని మేం భావోద్వేగాలతో కూడిన అందమైన, స్వచ్ఛమైన ప్రేమకథ అనే ప్రమోట్ చేశాం. పాకిస్తాన్ ఎపిసోడ్ ఇంకా ఉంటే బాగుండేదనే ఫీలింగ్‌ని కొందనే ప్రేక్షకులు వ్యక్త పరిచారు. ఆ ఫీలింగ్ ఉన్నప్పటికీ ఈ మూవీలోని ప్రతి అంశానికి ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు.
⇒ నాగచైతన్య సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టారు కాబట్టే ‘తండేల్’ సక్సెస్‌కి మించిన ప్రశంసలు ఆయన నటనకి వస్తున్నాయి. నాగచైతన్య కెరీర్‌లో తొలి వంద కోట్ల సినిమా ‘తండేల్’. ఈ క్రెడిట్ నిర్మాతలు అరవింద్, వాసుగార్లు, చైతన్య, దేవిశ్రీలతో పాటు యూనిట్‌కి దక్కుతుంది. నా అక్షర రూపానికి వారంతా విజువల్‌ని ఇచ్చారు.
‘తండేల్’ సక్సెస్ తర్వాత ‘థ్యాంక్యూ చందు. వి లవ్ యూ’ అని నాగార్జునగారు అనడం నాకు గొప్ప ప్రశంస. ‘తండేల్ దర్శకుడి సినిమా’ అని రాఘవేంద్రరావుగారు చెప్పడం మరచిపోలేని ప్రశంస. ఇక మా ‘తండేల్’ పైరసీ బారిన పడినప్పుడు గుండెల్లో గునపంతో పోడిచినట్లు, మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయినంత బాధగా అనిపించింది. నా తర్వాతి చిత్రం ‘కార్తికేయ 3’. సూర్యగారితో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment