
ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, టీవీ సీరియల్ నటుడు రాంబాబు (60) కరోనాతో మంగళవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లా గనపవరం మండలం కండ్రిగగూడెంకు చెందిన శ్రీమంతుల రాంబాబు 1960 జూన్ 15న జన్మించారు. 1987–88 మధ్యకాలంలో డీటీపీ ఆపరేటర్‌గా చేసి, ఆ తర్వాత సీనియర్ నటుడు కాకరాల వద్ద డబ్బింగ్‌లో శిక్షణ పొంది 1993 నుంచి డబ్బింగ్ కళాకారుడిగా కొనసాగారు. ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటితో కలిసి పలు చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. సుమారు వెయ్యి చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పారాయన. అనేక టీవీ సీరియళ్లలోనూ నటించారు. హైదరాబాద్ నుంచి ఇటీవల చెన్నైకు వచ్చిన రాంబాబుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఈయనకు భార్య లక్ష్మి, కుమారుడు జగదీశ్ ఉన్నారు. – సాక్షి, చెన్నై