ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని తెగ ఎదురు చూస్తుంటారు. అయితే ఇక్కడో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మాత్రం ఏకంగా రాంగ్ రూట్‌లో గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేసి కెమెరాలకు చిక్కాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని హెచ్చరించి హీరో తన పొరపాటును సరిదిద్దుకునేలా చేశారు.
మలయాళ ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ తన లగ్జరీ కారును తీసుకుని కేరళ రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఓ చోట అతడు రాంగ్ రూట్‌లో సిగ్నల్ కోసం వెయిట్ చేశాడు. ఇది గమనించిన ఓ పోలీసు అతడి కారు దగ్గరకు వెళ్లి మందలించాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించాడు. దీంతో అతడు తన కారును రివర్స్ తీసుకుని రోడ్డు కుడివైపు లైనులోకి ప్రవేశించాడు. దీన్నంతటినీ కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది నెట్టింట గింగిరాలు తిరుగుతోంది.
ఇదిలా వుంటే దుల్కర్ సల్మాన్ నటించిన కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాదిత్తాల్ రిలీజై ఏడాది పూర్తైన సందర్భంగా ఈ సినిమా టీమ్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ, వీజే రక్షన్, నిరంజని అగత్యాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులో కనులు కనులను దోచాయంటే పేరుతో విడుదలైంది.
మరోవైపు ‘పడి పడి లేచే మనసు’ సినిమా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ‘మహానటి’ సినిమాను నిర్మించిన స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నది. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment