నేటితరం హీరోయిన్లు అవకాశాలు పొందాలన్నా, కెరీర్ నిలబెట్టుకోవాలంటే వారి ముందున్న ఒకే ఒక ఆప్షన్ గ్లామర్.. స్టార్ హీరోయిన్లు సైతం స్కిన్ షోలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే యువనటి దుషారా స్కిన్ షోలతో అవకాశాలు పొందడం తనకు ఇష్టం లేదని, అలాగని తాను గ్లామర్‌కు వ్యతిరేకిని కాదని అంటోంది. బోదై ఏరి బుద్ధి మారి చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈ అచ్చ తమిళ ఆడపడుచు తొలి చిత్రంతోనే తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో ఆర్యకు జంటగా సర్పట్ట పరంపరై చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
ఆ చిత్రంలో పల్లెటూరి యువతిగా పరిణితి చెందిన నటనతో మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు పా.రంజిత్ దర్శకత్వంలో రెండోసారి నటించే లక్కీ ఛాన్స్‌ను దక్కించుకుంది. అదే నచ్చత్తిరం నగర్గిరదు నీలం ప్రొడక్షన్స్, యాళ్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాళిదాస్ జయరాంకు జంటగా దుషారా నటించింది. తెన్మా సంగీతం అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 31వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటి దుషారాతో సాక్షి ముచ్చటించింది. ఆమె మాట్లాడుతూ పా.రంజిత్ దర్శకత్వంలో రెండోసారి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది.
ఆయన చిత్రాల్లో కథానాయికలకు నటించడానికి అవకాశం ఉంటుందని చెప్పింది. నచ్చిత్తిరం నగర్గిరదు చిత్రంలో తనది చాలా ధైర్యం కలిగిన యువతి పాత్ర అని, సమకాలీన రాజకీయాలతో కూడిన ప్రేమ కథా చిత్రమని తెలిపింది. ముఖ్యంగా లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ అంశాలను చర్చించే విభిన్న కథాచిత్రమని చెప్పింది. ఇందులో కాళిదాస్ జయరాంతో నటించడం మంచి అనుభవం, ఇద్దరం పోటీ పడి నటించినట్లు తెలిపింది. తనకు చాలెంజింగ్ రోల్ పాత్రలో నటించడం చాలా ఇష్టమని పేర్కొంది. ఎన్ని చిత్రాలు చేశాం అనే దాని కంటే ఎన్ని మంచి పాత్రలు చేశామన్నదే తనకు ముఖ్యమని అంటోంది ఈ ముద్దుగుమ్మ.
Comments
Please login to add a commentAdd a comment