Good Night Movie Review And Rating Telugu - Sakshi
Sakshi News home page

Good Night Review In Telugu: 'గుడ్ నైట్' మూవీ తెలుగు రివ్యూ

Published Mon, Jul 3 2023 6:03 PM | Last Updated on Mon, Jul 3 2023 7:07 PM

Good Night Review And Rating Telugu - Sakshi

టైటిల్: గుడ్ నైట్
నటీనటులు: మణికందన్, మీరా రఘునాథ్, రమేశ్ తిలక్ తదితరులు
నిర్మాణ సంస్థ: మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్ఆర్పీ ఎంటర్ టైన్‌మెంట్
నిర్మాత: యువరాజ్ గణేశన్, మగేశ్ రాజ్, నజేరత్ పసిలియన్
దర్శకత్వం: వినాయక్ చంద్రశేఖరన్
సంగీతం: సీన్ రోల్డన్
సినిమాటోగ్రఫీ: జయంత్ సేతు మాధవన్
ఎడిటర్: భరత్ విక‍్రమన్
విడుదల తేదీ: 2023 జూలై 03
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

సినిమా హిట్ అవ్వాలంటే భారీతనం, హంగులే అక్కర్లేదు. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసేలా ఓ కథ-కథనం ఉంటే చాలు. కచ్చితంగా హిట్ అవుతుంది. భాషతో సంబంధం లేకుండా ఆదరణ సొంతం చేసుకుంటుంది. అలా మనందరికీ తెలిసిన 'గురక' అనే పాయింట్ తో తమిళంలో వచ్చిన సినిమా 'గుడ్ నైట్'. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. హాట్‌స్టార్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

కథేంటి?
మోహన్ అలియాస్ మోటర్ మోహన్(మణికందన్)కు గురక సమస్య. నిద్రపోయాడంటే సౌండ్ రీసౌండ్ వస్తుంది. అమ్మ, అక్క-బావ, చెల్లితో కలిసుంటాడు. తన గురక గురించి అందరూ తిడుతున్నాసరే దానికి అలవాటు పడిపోతాడు. ఓరోజు అనుకోని పరిస్థితుల్లో అను (మీరా రఘునాత్) పరిచయమవుతుంది. మనుషుల‍్లో పెద్దగా కలవని ఈమె.. మోహన్ తో లవ్‌లో పడుతుంది. కొన్నిరోజులకే పెళ్లి చేసుకుంటుంది. ఫస్ట్ నైట్ రోజు.. భర్తకు గురక ప్రాబమ్ ఉందని ఈమెకు తెలుస్తుంది. మరి తర్వాత ఏమైంది? భార్యభర్తలు చివరకు ఒక్కటయ్యారా? లేదా అనేదే మెయిన్ స్టోరీ.

ఎలా ఉందంటే?
కొత్త ఫ్లాట్.. మోహన్-అనుకి ఫస్ట్ నైట్.. రాత్రంతా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. నిద్ర ముంచుకురావడంతో మోహన్ పడుకుంటాడు. తెలియకుండానే గట్టిగా గురక పెడతాడు. ఇబ్బందిపడుతూనే అను ఆ రాత్రి గడుపుతుంది. తన అసౌకర్యం గురించి భర్తకి చెప్పదు. ఉదయం లేచి, అతడు అడిగినా సరే పర్లేదు అని చెబుతుంది. ఇది ఓ సీన్. 

కాపురం మొదలైన కొన్నాళ్లకు భర్త గురక వల్ల అను ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒంటరిగా వేరే ఇంట్లోకి మారిపోతుంది. కానీ ఆమెకు నిద్ర పట్టదు. ఒంటరిగా ఉన్నాసరే రాత్రంతా భర్త గురించే ఆలోచనలు. దీంతో వాట్సాప్ ఓపెన్ చేసి, అందులో భర్త ఇంతకు ముందు తనకు సెండ్ చేసిన గురక రికార్డింగ్స్‌ని ఈయర్ ఫోన్స్ పెట్టుకుని మరీ వింటుంది. ఇది మరో సీన్. మొదటి సీన్ చూస్తున్నప్పుడు మనకు నవ్వొస్తుంది. రెండో సీన్ చూస్తున్నప్పుడు అనుతో పాటు మనమూ ఎమోషనల్ అవుతాం. అదే ఈ సినిమాలో మ్యాజిక్.

టైటిల్స్ పడకముందే మనకు గురక సౌండ్ వినిపిస్తుంది. కాసేపటికే మోహన్ ని చూపిస్తారు. ఇకు ఆలస్యం చేయకుండా నేరుగా స్టోరీలో మెయిన్ పాయింట్ ఏంటనేది డైరెక్టర్ చెప్పేశాడు. ఆ తర్వాత మోహన్ కుటుంబాన్ని, అతడు జీవితంలో ఉండే మనుషులు, వాతావారణాన్ని పరిచయం చేస్తూ వెళ్లాడు. గురక వల్లే తన ఆఫీసులోనే పనిచేస్తున్న ఓ అమ్మాయి మోహన్‌కి బ్రేకప్ చెప్పడం, ఆ తర్వాత అతడి ఇంటికొచ్చి ఏడవడం, అది చూస్తున్న మనకు నవ్వు రావడం లాంటి సీన్స్ వరసగా వస్తుంటాయి.

మోహన్, అను.. ఇద్దరు జీవితాలు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. అలాంటిది ఓరోజు అనుకోకుండా వీళ్లిద్దరూ పరిచయవుతారు. స్నేహం.. ప్రేమ.. పెళ్లి.. ఇదంతా జరిగేసరికి ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఫస్టాప్ మొత్తాన్ని ఎంటర్ టైనింగ్‌గా తీసిన డైరెక్టర్.. సెకండాఫ్ లో ఎమోషన్స్ ని నమ్ముకున్నాడు. భర్తకు గురక సమస్య ఉందని తెలిసిన తర్వాత అను జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి? మోహన్ ఏం చేశాడు? ఫైనల్ గా ఏం జరిగిందనేది క్లైమాక్స్. ఈ సినిమాలోనే మోహన్ బావ-అక్క స్టోరీ కూడా ఉంటుంది. ఈ కాలం తల్లిదండ్రుల తీరుని క్వశ్చన్ చేసేలా అదంతా ఉంటుంది.

దాదాపు రెండున్నర గంటలున్న ఈ సినిమాలో ఫస్టాప్ ని చకచకా నడిపించేసిన డైరెక్టర్.. సెకండాఫ్ లో కాస్త నిదానమే ప్రదానం అనే ఫార్ములా పాటించాడు. గురక తగ్గించుకోవడానికి మోహన్ పడే పాట్లు లాంటి సీన్స్.. రిపీట్‌గా అనిపిస్తాయి. కొన్నిచోట్లు మెలోడ్రామా ఎక్కువైంది. మోహన్, అను పాత్రలు.. తమకు వచ్చిన సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. కానీ కలిసి ఉంటేనే ఏ బంధమైనా నిలుస్తుందని చెబుతూ సాగే క్లైమాక్స్ సీన్స్ మనల్ని ఎమోషనల్ చేస్తాయి.

ఎవరెలా చేశారు?
మోహన్ పాత్రలో మణికందన్ అదరగొట్టేశాడు. ఏ పాయింట్ లో కూడా ఓ నటుడిని చూస్తున్నాం, ఇది సినిమా అనే ఫీలింగ్ అస్సలు అనిపించదు. గురక పెట్టే సీన్స్ నుంచి అను దూరమవుతుందనే భయంతో బాధపడే సన్నివేశాల‍ వరకు చాలా నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. అను పాత్రలో మీరా రఘునాథ్ ఫెర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇంటర్వెర్ట్, అమాయకురాలిగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆ పాత‍్రతో పాటు జర్నీ చేసేలా చేసింది. మోహన్ బావ పాత్రలో నటించిన రమేశ్ తిలక్.. కనిపించిన ప్రతి సీన్ లో నవ్వించాడు. చివర్లో మాత్రం ఏడిపించేశాడు. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ విషయాల్లో సీన్ రొల్డన్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. జయంత్ సేతు సినిమాటోగ్రఫీ నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ప్రతి సీన్ ని అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఎడిటర్ భరత్ విక్రమన్.. సెకండాఫ్ లో కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉండాల్సింది. రైటర్ అండ్ డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖరన్.. అందరికీ తెలిసిన గురక అనే సమస్యని తీసుకుని దాన్ని ఫన్నీ అండ్ ఎమోషనల్ వేలో భలే తీశాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే.. కుటుంబంతో కూర్చొని, నీట్ అండ్ క్లీన్ ఎంటర్‌టైనర్ చూద్దామనుకుంటే 'గుడ్ నైట్' సినిమా బెస్ట్ ఆప్షన్.

- చందు, సాక్షి వెబ్ డెస్క్

(ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ))

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement