సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ జగత్తంతా సిరివెన్నెల పరచిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మనకిక లేరు. తొలి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న కారణజన్ముడు ఆయన. న్యూమోనియాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల తిరిగి రాని లోకానికి తరలి పోయారు. దీంతో త్వరగా కోలుకుని ఆయన ఇంటికి తిరిగి చేరుకుంటారన్న కోట్లాదిమంది ఆశలు అడియాశలయ్యాయి. (Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే)
"మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు" - మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?...విశ్వాత్మలో కలిసిపోయావా? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
— dev katta (@devakatta) November 30, 2021
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో 1955 మే 20న డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు చెంబోలు సీతారామ శాస్త్రి. గేయరచయితగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 2020 వరకు 3000 పాటలకు పైగా సాహిత్యం అందించారు. పదకొండు నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించారు. ఈ రంగంలో ఆయన కేసిన కృషికి గాను 2019లో పద్మశ్రీ పురస్కారం లభించింది.
జననీ జన్మభూమి సినిమాకు గేయ రచయితగా అరంగేట్రం చేసినప్పటికీ, కే.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల మూవీలో పాటలకుగాను సిరివెన్నెలగా తన పేరును స్థిరపర్చుకున్నారు. ‘ఆది భిక్షువు’ పాటకు ఉత్తమ గీత రచయితగా శాస్త్రి తన మొదటి నంది అవార్డును అందుకున్నారు. ఆ తరువాత ఆయన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ‘బూడిదిచ్చే వాడి నేటి అడిగేది అన్నా, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అన్నా అది ఆయనకే చెల్లు.
స్వయం కృషి, స్వర్ణ కమలం, సంసారం, ఒక చదరంగం, శ్రుతిలయలు, పెళ్లి చేసి చూడు వంటి చిత్రాలలో అనేక పాటలకు మాటలు రాశారు. 1986, 1987, 1988లో వరుసగా మూడు సంవత్సరాలలో నంది అవార్డులను గెలుచుకున్న ఘనత ఆయన సొంతం. స్వరకల్పన, అన్న తమ్ముడు, ఇంద్రుడు చంద్రుడు, అల్లుడుగారు, అంతం ,రుద్రవీణ, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలకు తన పాటతో ప్రాణం పోశారు. ఆ తర్వాతికాలంలో క్షణ క్షణం, స్వాతి కిరణం, మురారి, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, ఎలా చెప్పను, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శుభలగ్నం, చక్రం, కృష్ణం వందే జగద్గురుం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే.
ప్రేమ అయినా, విరహమైనా, దేశభక్తిఅయినా, విప్లవ గీతమైనా ఆయన పాట చెరగని ముద్ర. ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే. ప్రతీ పదమూ హృదయాన్ని తాకేదే. అలనాటి దిగ్గజ రైటర్స్ వేటూరి, ఆత్రేయతో పాటు టాలీవుడ్‌లో గొప్ప గేయ రచయితగా తన పేరును సార్థకం చేసుకున్నారు. అంతేకాదు చంద్రబోస్, అనంత్ శ్రీరామ్, రామ జోగయ్య శాస్త్రి వంటి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన నటుడు, గాయకుడు కూడా. కళ్లు సినిమాలో ‘తెల్లారింది లెగండోయ్.. కొక్కొరోకో..’ అంటూ సినీ అభిమానులను నిద్ర లేపిన ఆయన గళం మూగబోయింది.
Comments
Please login to add a commentAdd a comment