ధనుష్‌తో లింక్‌ చేశారు.. రెండో పెళ్లి గురించి..: మీనా | Senior Heroine Meena Slams Second Marriage Rumours - Sakshi
Sakshi News home page

Meena: గీతాంజలి, నిన్నే పెళ్లాడతా.. మిస్‌ అయ్యా! రెండోపెళ్లిపై ఏమందంటే?

Published Wed, Dec 27 2023 4:07 PM | Last Updated on Wed, Dec 27 2023 4:48 PM

Heroine Meena Squashes Second Marriage Rumours - Sakshi

బాలనటిగా వెండితెరపై రంగప్రవేశం చేసింది మీనా. ఆ తర్వాత కొంతకాలానికే హీరోయిన్‌గానూ మారింది. దక్షిణాదిన ఎందరో స్టార్‌ హీరోలతో జోడి కట్టి వారి సరసన ఆడిపాడింది. దాదాపు మూడు దశాబ్దాలపాటు అగ్రతారగా వెలుగొందింది. కెరీర్‌ పీక్స్‌లో ఉండగా వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరికి నైనికా అనే పాప జన్మించింది. గతేడాది మీనాను ఒంటరి చేస్తూ విద్యాసాగర్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ బాధలో నుంచి నెమ్మదిగా కోలుకుని మళ్లీ సినిమాలు చేస్తూ బిజీ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది మీనా.

ఒకే ఒక్కసారి అలాంటి డ్రెస్‌
'అప్పట్లో చాలామంది హీరోయిన్స్‌ గ్లామర్‌ పాత్రలు చేస్తుండేవారు. నాకూ చేయాలనిపించేది. కానీ అంత కంఫర్ట్‌గా అనిపించేది కాదు. అయితే ఒకసారి ట్రై చేసి చూద్దామనుకున్నాను. అలా తమిళ సినిమాలో ఒకే ఒక్కసారి బికినీ వేసుకున్నాను. కానీ అప్పుడు చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. అందుకే మళ్లీ అలాంటి డ్రెస్‌ వేసుకోలేదు. బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేసేలోపు సౌత్‌లో నాలుగు చిత్రాలు చేయొచ్చని విన్నాను. ఇక్కడ బిజీ అవడంతో బాలీవుడ్‌ నుంచి అవకాశాలు వచ్చినా అక్కడికి వెళ్లలేదు.

నిన్నే పెళ్లాడతా నేను చేయాల్సింది
గీతాంజలి సినిమాలో చిన్నపాపగా నేను చేయాల్సింది. కానీ అప్పుడు ఎగ్జామ్స్‌ ఉండటంతో అమ్మ ఒప్పుకోలేదు. అలా ఆ మూవీ మిస్‌ అయింది. నిన్నే పెళ్లాడతా సినిమాలో హీరోయిన్‌గా చేయాల్సింది. డేట్స్‌ ఖాళీ లేకపోవడంతో ఒప్పుకోలేదు. నరసింహ సినిమాలో కూడా నేను చేయాల్సింది. అది కూడా మిస్‌ అయ్యాను. నా భర్తకు లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాల్సింది. కానీ చికిత్స ఆలస్యం కావడంతో పరిస్థితి చేజారిపోయింది. తను వెళ్లిపోయిన బాధలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఆయన చనిపోయిన రెండు నెలలకే నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు.

ధనుష్‌తో లింక్‌ చేశారు
హీరో ధనుష్‌తో లింక్‌ చేశారు. చాలామందితో సంబంధం అంటగట్టారు. అవి చదివి నా ఫ్యామిలీ ఎంత బాధపడుతుందనేది కూడా ఆలోచించట్లేదు! ఒకానొక సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందనేది నేను ఊహించలేను. ఇప్పట్లో మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాత్రం అస్సలు లేదు. అలా అని జీవితాంతం ఒంటరిగా ఉంటానని చెప్పలేను. ఏం జరుగుతుందో చూద్దాం' అని చెప్పుకొచ్చింది మీనా.

చదవండి: 'తల నరికితే రూ.కోటి'.. గట్టిగా బుద్ధి చెప్పనున్న వర్మ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement