సాక్షి, అమరావతి: టైగర్ నాగేశ్వరరావు సినిమా టీజర్‌లో వాడిన భాష ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అనుమతి లేకుండా టీజర్ విడుదల చేయడంపై అభ్యంతరం తెలిపింది. తగిన అనుమతులు తీసుకోకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి టీజర్ల ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీసింది.
సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ధనార్జనే ధ్యేయంగా సినిమాల నిర్మాణం ఉండకూడదని పేర్కొంది. ఈ మేరకు టైగర్ నాగేశ్వరరావు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్‌పర్సన్‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. సినిమాపై అభ్యంతరాలన్నింటినీ సీబీఎఫ్‌సీ చైర్‌పర్సన్‌కు తెలియజేసుకునేందుకు పిటిషనర్‌కు అనుమతి ఇచ్చింది.
తదుపరి విచారణను సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎరుకల సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ చుక్కా పాల్‌రాజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపి టీజర్‌లోని భాషపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
చదవండి: 99% పక్కా అన్నారు, ఏమైందో మరి.. చివరికి నన్ను తీసేశారు.. మై విలేజ్ షో అనిల్
Comments
Please login to add a commentAdd a comment