బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకోన్‌కు ఆస్కార్ అవార్డు కమిటీ నుంచి ఆహ్వానం అందింది. మార్చి 12న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ వేదికపై మెరవనున్నారామె. జిమ్మి కెమ్మల్ హోస్ట్‌గా జరగనున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఓ ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు దీపికా పదుకోన్. ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవ తొలి దశ ప్రెజెంటర్స్ 16 మంది జాబితాను నిర్వాహకులు ప్రకటించారు.
రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, మైఖేల్ బి జోర్డాన్, గ్లెన్ క్లోజ్, శ్యాముల్ ఎల్. జాక్సన్, డ్వేన్ జాన్సన్, జోయ్ సాల్డానా, జెన్నిఫర్ కొన్నెల్లీ తదితర హాలీవుడ్ తారలు ఉన్న ఈ జాబితాలో దీపికా పదుకోన్ ఉన్నారు. ఇక 2017లో జరిగిన ఆస్కార్ ఆఫ్టర్ పార్టీ (అవార్డుల ప్రదానోత్సవం తర్వాత జరిగే పార్టీ)లో పాల్గొన్న దీపికా ఈసారి ఓ ప్రెజెంటర్‌గా ఈవెంట్‌కు వెళ్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.
అలాగే ప్రెజెంటర్స్ మలి జాబితా లోనూ ఇండియన్ స్టార్స్ ఉంటారా? అనే విషయం తెలియాలంటే కొంత సమయం వేచి ఉండాలి. ఇక ‘బెస్ట్ ఒరిజి నల్ సాంగ్’ విభాగంలో అవార్డు కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ పాట నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేదికపై లైవ్‌లో ఈ పాట పాడనున్నారు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ గత ఏడాది మార్చిలో విడుదలైన సంగతి తెలిసిందే.
మొదలైన ఓటింగ్
ఆస్కార్ అవార్డు విజేతలకు సంబంధించిన ఆన్‌లైన్ ఓటింగ్ గురువారం ఆరంభమైంది. ఈ ఓటింగ్ మార్చి 7 వరకు జరుగుతుంది. ఆస్కార్ అకాడమీలో పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరందరూ ఆన్‌లైన్‌లో ఓటింగ్ వేస్తారు. ఓటర్స్‌లో ఉన్న యాక్టర్స్ ‘యాక్టింగ్’ విభాగానికి, ఎడిటర్స్ ‘ఎడిటింగ్’ విభాగానికి.. ఇలా ఇతర విభాగాలకు చెందినవారు ఆ విభాగానికి ఓట్లు వేస్తారు. కానీ ‘ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్’, ‘యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్’ విభాగాల ఓటింగ్‌కు మాత్రం ప్రత్యేక నియమ నిబంధనలున్నాయి.
అలాగే బెస్ట్ పిక్చర్స్ విభాగానికి ఆస్కార్ ఓటర్స్ అందరూ ఓటు వేయొచ్చు. ఓటింగ్ పూర్తయ్యాక ఆ ఫలితాలు ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ సంస్థ వద్ద ఉంటాయి. అవార్డులను అధికారికంగా ప్రకటించడానికి ముందు ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (ఆస్కార్ ఆన్‌లైన్ ఓటింగ్ రిజల్ట్స్ సెక్యూరిటీని చూసేవారు)కు చెందిన ఇద్దరు వ్యక్తులకు మాత్రమే విజేతలు ఎవరో తెలుస్తుందని అవార్డు కమిటీ పేర్కొంది.
బెస్ట్ పిక్చర్ ఓటింగ్ ఇలా..
బెస్ట్ పిక్చర్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న చిత్రాలకు ఆస్కార్ ఓటర్లు 1, 2, 3.. అంటూ ర్యాంకింగ్‌లు ఇస్తారు. ఓటర్లందరూ ర్యాంకింగ్‌లు ఇచ్చిన తర్వాత ఏ చిత్రం యాభైశాతం ఓటర్ల ఫేవరెట్‌గా నిలుస్తుందో అదే బెస్ట్ పిక్చర్‌గా నిలుస్తుంది.
‘ఆర్‌ఆర్‌ఆర్’కు స్టాండింగ్ ఒవేషన్
ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌లో హీరో రామ్‌చరణ్ (మరో హీరో ఎన్టీఆర్ సోమవారం అమెరికా వెళ్తారని తెలిసింది), దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్ అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ఈ నెల 3న రీ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా లాస్ ఏంజిల్స్‌లోని ప్రముఖ ఏస్ హోటల్ థియేటర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ప్రదర్శించారు. షో పూర్తయ్యాక ‘ఆర్‌ఆర్‌ఆర్’కు స్టాండింగ్ ఒవేషన్ దక్కింది.
ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘ఓ నటుడిగా ఈ క్షణాలను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. ఎంత కష్టపడైనా సరే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలన్నదే నా లక్ష్యం. రాజమౌళిగారితో పని చేస్తే సినిమాల పట్ల నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. ఆయన నాకు ప్రిన్సిపాల్, గురువులాంటివారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో తారక్ (ఎన్టీఆర్) నాకు ఇంకా ఇంకా దగ్గరయ్యాడు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment