ప్రస్తుతం ఎవర్‌గ్రీన్ నటిగా రాణిస్తున్న నటి జ్యోతిక. చంద్రముఖి చిత్రం తర్వాత ఆమె నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడారు. ఆ తర్వాత నటనకు కాస్త విరామం ఇచ్చారు. అది కూడా కుటుంబం కోసమే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలా జ్యోతిక నటించిన 36 వయదినిలే చిత్రం చేసి సూపర్‌హిట్ కొట్టారు. ఆ తరువాత వరుసగా నటనను కొనసాగిస్తున్నారు.
ఇటీవల బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి సైతాన్ చిత్రంతో అక్కడా సక్సెస్ సాధించారు. దీంతో హిందీలో మరిన్ని అవకాశాలు ఈమె తలుపు తడుతున్నాయని సమాచారం. జ్యోతిక ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఉడన్ పిరప్పే. నటుడు శశికుమార్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇతి వృత్తంతో ఆర్.శరవణన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం 2021లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను పొందింది.
ఇది జ్యోతికకు చాలా నచ్చిన చిత్రం కావడం గమనార్హం. కాగా తాజాగా ఉడన్‌పిరప్పే చిత్రానికి సీక్వెల్‌ను చేయాలని జ్యోతిక ఆశిస్తున్నట్లు సమాచారం. అందుకు దర్శకుడు శరవణన్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జ్యోతిక మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడంతో ఈ చిత్రాన్ని ఆ స్థాయిలో చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉడన్‌పిరప్పే సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment