విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో 1996లో వచ్చిన హిట్ మూవీ ‘భారతీయుడు’ కి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రూపొందింది. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ తెలుగులో ‘భారతీయుడు 2’, తమిళంలో ‘ఇండియన్ 2’, హిందీలో ‘హిందుస్థానీ 2’ పేరుతో ఈ నెల 12న విడుదల కానుంది. రిలీజ్ డేట్‌కి సమయం దగ్గరపడటంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘ఐ–రోబో’ అనే ఇంగ్లిష్ నవలను సినిమాగా తెరకెక్కిస్తే బాగుంటుందని నేను, శంకర్, రచయిత సుజాత (ఎస్. రంగరాజన్ ) 90ల్లోనే అనుకున్నాం.
నా పాత్ర లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. కానీ, ఆప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇండస్ట్రీలో బడ్జెట్, పారితోషికం, డేట్స్, మార్కెట్.. ఇలా ఎన్నో లెక్కలు ఉంటాయి. అప్పటి మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయకపోవడమే మంచిదనిపించింది. అందుకే నేను వెనకడుగు వేశా. కానీ, నా స్నేహితుడు శంకర్ మాత్రం వదల్లేదు. సరైన సమయంలో రజనీకాంత్‌తో ‘రోబో’ సినిమా తీసి, బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే ‘2.0’ మూవీలో విలన్ పాత్ర కోసం నన్ను సంప్రదించారు శంకర్. అయితే కొన్నాళ్ల పాటు నేను హీరోగా ఉండాలనుకుంటున్నానంటూ నవ్వుతూ శంకర్‌కు చెప్పాను’’ అన్నారు కమల్ హాసన్. అయితే రజనీకాంత్ హీరోగా నటించిన ‘2.0’ మూవీలో విలన్‌గా అక్షయ్ కుమార్ నటించారు.
Comments
Please login to add a commentAdd a comment