Indian 2: కమల్‌ హాసన్‌ మధ్యవర్తిత్వం? | Kamal Haasan to mediate between Shankar and Lyca for Indian 2 | Sakshi
Sakshi News home page

వివాదాన్ని పరిష్కరించనున్న కమల్‌ హాసన్‌

Published Tue, May 11 2021 12:50 AM | Last Updated on Tue, May 11 2021 8:03 AM

Kamal Haasan to mediate between Shankar and Lyca for Indian 2 - Sakshi

‘ఇండియన్‌ 2’ చిత్రీకరణ విషయంలో చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, ఈ చిత్ర దర్శకుడు శంకర్‌లకు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘ఇండియన్‌ 2’ని పూర్తి చేయకుండా శంకర్‌ మరో సినిమాకు దర్శకత్వం వహించకూడదని లైకా ప్రతినిధులు అంటుంటే, షూటింగ్‌కు సరైన సదుపాయాలు కల్పించకుండా, నా తర్వాతి ప్రాజెక్ట్స్‌ను నియంత్రించే హక్కు లైకా వారికి లేదని శంకర్‌ అంటున్నారు. ఈ వివాదంపై కోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. అయితే లైకా ప్రొడక్షన్స్‌ ప్రతినిధులు, దర్శకుడు శంకర్‌ కూర్చుని చర్చించుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోర్టు ఇటీవల ఓ సందర్భంలో సూచించింది కూడా.

ఇప్పుడు ఈ బాధ్యతను ‘ఇండియన్‌ 2’ సినిమాలో హీరోగా నటిస్తున్న కమల్‌హాసన్‌ తీసుకుని వారధిలా ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిత్వం చేసే ఆలోచనలో ఉన్నారట. లైకా ప్రొడక్షన్స్, శంకర్‌తో ముందు విడిగా మాట్లాడి, ఆ తర్వాత ఇరు పక్షాల మధ్య ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కమల్‌హాసన్‌ ప్రయత్నాలు చేస్తున్నారట. మరి.. కమల్‌ జోక్యంతోనైనా శంకర్, లైకా ప్రొడక్షన్స్‌ మధ్య నడుస్తున్న వివాదం కొలిక్కి వస్తుందా? సమస్య పరిష్కారం అయి, షూటింగ్‌ మొదలవుతుందా? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. 1996లో దర్శకుడు శంకర్, హీరో కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’)కి సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ రూపొందుతోంది. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్, బాబీ సింహా ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.

చదవండి: ఆ రిస్క్‌ చేయను: హీరోయిన్‌ ప్రణీత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement