‘‘సినిమా పరిశ్రమలో దాదాపు పదేళ్ల పాటు నాకు అవకాశాలు రాకుండా కొంతమంది కుట్రలు చేశారు. వారి వేధింపులు తట్టుకోలేక ఆ సమయంలో దేశం విడిచిపెట్టి వెళ్లాలనుకున్నాను’’ అని నటి, మండీ లోక్‌సభ ఎంపీ కంగనా రౌత్ అన్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ నెల 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా రనౌత్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కీలక విషయాలు వెల్లడించారు.
‘‘సినిమా పరిశ్రమ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఎప్పటికైనా మంచి హీరోయిన్ కావాలనే ఆశతో 2004లో ముంబైకి వచ్చాను. 2005–06లో ‘గ్యాంగ్‌స్టర్’, ‘వో లమ్హే’ సినిమాల్లో నటించాను. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సూపర్ మోడల్, గ్యాంగ్‌స్టర్ వంటి ఎన్నో పాత్రలు పోషించాను. నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. పొగడ్తలు పక్కన పెడితే దాదాపు పదేళ్ల పాటు నాకు అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఛాన్సులు దొరకలేదు. నాకు అవకాశాలు రాకపోవడానికి కారణం బాలీవుడ్ మాఫియా అని అర్థం అయ్యింది.
ఒకానొక సమయంలో దేశమే నన్ను బహిష్కరించిందనిపించింది.. విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నాను. అమెరికాకు వెళ్లిపోయి ఓ షార్ట్ ఫిలిం కూడా తీశాను. అయితే 2014లో విడుదలైన ‘క్వీన్’ సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పింది’’ అని కంగనా తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ– ‘‘నాకు నటించడం సులభం. కానీ, నటిగా చేయడం పెద్దగా ఇష్టం లేదు. డైరెక్టర్‌గా ఉండటం ఇష్టం. నటిగా ఉంటే సెట్స్‌లో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదు. అదే డైరెక్టర్‌గా ఉంటే పూర్తి విషయాలు తెలుస్తాయి. పైగా సెట్స్‌లో డైరెక్టర్‌కు ఎక్కువ గౌరవం ఉంటుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment