Kannada Actor Puneeth Rajkumar Passes Away With Heart Attack - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar Death: పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు

Published Fri, Oct 29 2021 1:44 PM | Last Updated on Sat, Oct 30 2021 2:46 PM

Kannada Super Star Puneeth Rajkumar Passed Away - Sakshi

Kannada Super Star Puneeth Rajkumar Passed Away: ప్రముఖ కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.


                             (పునీత్‌ రాజ్‌కుమార్‌ పార్థీవ దేహం)

పునీత్‌ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. కాగా 1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన పునీత్‌... 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్‌ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు. 

భారతీయ సినిమాకు, మరీ ముఖ్యంగా కన్నడ సినిమాకు ముఖ్య అధ్యాయం రాజ్‌కుమార్‌. నట సార్వభౌముడు, బంగారు మనిషి, కన్నడ కంఠీరవ, కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌.. ఇలా కన్నడ సినిమా ఆయన్ను ముద్దుగా పిలుచుకుంది. రాజ్‌కుమార్‌కు ఉన్న ఐదుగురు సంతానంలో ఆఖరివాడు లోహిత్‌. 1975 మార్చి 19న చెన్నైలో రాజ్‌కుమార్‌–పార్వతమ్మలకు జన్మించాడు లోహిత్‌. ఆరు నెలల పసికందుగా ఉన్నప్పుడే తండ్రి రాజ్‌కుమార్‌ నటించిన ‘ప్రేమద కానికే’ (1976) చిత్రంలో తొలిసారి తెరపై మెరిశాడు. లోహిత్‌ పేరుతోనే తెరకు పరిచయమయ్యాడు. అయితే అప్పటికే అలాంటి పేరుతో ఓ బాలనటుడు ఉండటంతో కన్‌ఫ్యూజ్‌ అవుతుందని పునీత్‌గా మార్చారు. రెండో సినిమా ‘సన్నాది అప్పన్నా’ (1997) నుంచి పునీత్‌ రాజ్‌కుమార్‌గా మారిపోయాడు లోహిత్‌.

ఆ తర్వాత ‘తాయిగే తక్క మగ’ (1978), ‘వసంత గీత’ (1980), ‘భూమిగే బంద భగవంత’ (1981), ‘భాగ్యవంత’ (1982) సినిమాల్లో నటించాడు. ‘భాగ్యవంత’తోనే తొలిసారి గాయకుడిగానూ మారాడు. అదే ఏడాదిలో తన తండ్రితో కలసి చేసిన ‘చాలుసివ మొడగళ్లు’కి గానూ కర్నాటక ప్రభుత్వం ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందించింది. ఆ తర్వాత ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో ప్రహ్లాద పాత్ర చేశాడు. అలాగే సింగీతం శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ‘ఎరడు నక్షత్రగళు’ చిత్రంలో బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాకు ఉత్తమ బాలనటుడిగా కర్నాటక ప్రభుత్వం నుంచి రెండో అవార్డు అందుకున్నాడు. ఇక ‘బెట్టద  హూవు’ (1985) చిత్రానికి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. 1988లో తన పెద్దన్నయ్య శివ రాజ్‌కుమార్‌ చేసిన ‘శివ మెచ్చిడ కన్నప్ప’ చిత్రంలో బాల కన్నప్ప పాత్ర చేశాడు. బాలనటుడిగా పునీత్‌ చేసిన చివరి చిత్రం ‘పరశురామ’ (1989). బాలనటుడిగా పునీత్‌ కెరీర్‌ వైభవంగా సాగింది. 

వ్యాపారం టు వెండితెర
హీరో కొడుకు హీరోనే అవ్వాలా.. వద్దు.. మనం రూటు మార్చుదాం అనుకున్నారు పునీత్‌. అందుకే వ్యాపారాలు చేశారు. అయినా సినిమా నేపథ్యం వదులుతుందా? తప్పక సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ కొడుకు కదా.. అభిమానులు కోరితే రావాల్సిందే. తండ్రి కూడా ‘ఒకసారి ట్రై చెయ్‌’ అన్నారు. తండ్రి మాట కాదనని కొడుకు... అందుకే హీరో అవ్వాలని ఫిక్సయ్యాడు.

తొలి సినిమా పేరే ముద్దు పేరుగా...
హీరో అవ్వాలనుకున్న తర్వాత పునీత్‌ తన నటన, డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ మీద దృష్టి పెట్టాలనుకోలేదు. ఫిట్‌నెస్‌ మీదే దృష్టి పెట్టారు. అప్పటికి కాస్త బొద్దుగా ఉన్న పునీత్‌ తగ్గాలనుకున్నారు. అప్పుడు ఆరంభించిన కఠినమైన ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ చనిపోయే రోజు ఉదయం వరకూ కొనసాగింది. ఇక పునీత్‌ని హీరోగా పరిచయం చేసే ఛాన్స్‌ మన డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌కి దక్కింది. 2002లో పునీత్‌ని హీరోగా పరిచయం చేస్తూ ‘అప్పుు’ తెరకెక్కించారు పూరి. రవితేజ ‘ఇడియట్‌’ సినిమాకు ఇది ఒరిజినల్‌. పునీత్‌ కోసం çపూరి రాసిన కథ రాజ్‌కుమార్‌ కుటుంబానికి నచ్చింది.

బాక్సాఫీస్‌ బంపర్‌ హిట్‌తో రాజ్‌కుమార్‌ కుటుంబానికి కావాల్సిన మ్యాజిక్‌ని పూరి చేశారు. అయితే సినిమా నేపథ్యం ఉండి, అది కూడా మాస్‌ హీరో ఇమేజ్‌ ఉన్న కుటుంబం నుంచి పరిచయమయ్యే హీరోలకు మొదటి సినిమా అంటే.. అప్పటివరకూ ఆ ఫ్యామిలీ సాధించిన ఇమేజ్‌ని, వాళ్లు చేసిన సినిమాలను ముందుకు తీసుకెళ్లడమే. ఆ వారసత్వానికి  కొనసాగింపులాగా అన్నమాట. బోలెడంత ఫాలోయింగ్‌తో పాటు బండెడు ఒత్తిడి, అంతులేని అంచనాలు ఉంటాయి. వీటన్నింటినీ దాటడం సులువు కాదు. అభిమానులను, ప్రేక్షకులను సంతృప్తిపరచడం అంతకన్నా సులువు కాదు. కానీ వీటన్నింటినీ సునాయాసంగా దాటేశారు పునీత్‌. అభిమానులకు ‘అప్పు’... కన్నడ సినిమా బాక్సాఫీస్‌కి ‘పవర్‌స్టార్‌’ అయిపోయారు. తొలి సినిమా అప్పటినుంచి ప్రేక్షకులు ‘అప్పు’ అని పునీత్‌ని పిలవడం మొదలుపెట్టారు. 

రీమేక్‌ స్పెషలిస్ట్‌
పునీత్‌ కెరీర్‌ గ్రాఫ్‌ని గమనిస్తే ఎక్కువగా  రీమేక్స్‌ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రీమేక్స్‌. పునీత్‌ని హీరోగా లాంచ్‌ చేయడంతో పాటు సూపర్‌స్టార్‌ ఇమేజ్‌కి పునాదులు వేసింది పూరీ కథలే అని చెప్పొచ్చు. 2004లో పునీత్‌ చేసిన ‘వీర కన్నడిగ’ బాక్సాఫీస్‌ బ్లాక్‌బస్టర్‌. తెలుగులో ‘ఆంధ్రావాలా’గా ఎన్టీఆర్‌ హీరోగా పూరి, ఇదే చిత్రాన్ని కన్నడంలో ‘వీర కన్నడిగ’ పేరుతో మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ‘అమ్మా నాన్న ఓ తమ్మిళ అమ్మాయి’ చిత్రం ‘మౌర్య’ రీమేక్‌లో నటించారు పునీత్‌. ఈ చిత్రానికి ఎస్‌. నారాయణ్‌ దర్శకుడు. 2006లో ‘ఒక్కడు’ చిత్రాన్ని ‘అజయ్‌’ టైటిల్‌తో పునీత్‌తో తెరకెక్కించారు మెహర్‌ రమేష్‌. కన్నడ భాషలోనూ ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌. పునీత్‌ రాజ్‌కుమార్‌ని ‘పవర్‌స్టార్‌’ని చేసింది ఈ చిత్రం. ఆ తర్వాత ‘రెyీ , దూకుడు’ చిత్రాలను ‘రామ్‌’ (2009), ‘పవర్‌’ (2015) అనే టైటిల్స్‌తో రీమేక్‌ చేశారు పునీత్‌. అలాగే తమిళ సినిమాలు ‘నాడోడిగళ్‌’, ‘పోరాళి’, ‘పూజై’, చిత్రాలను ‘హుద్‌గరు’, ‘అన్నా బాండ్‌’, అంజనీపుత్ర’గా రీమేక్‌ చేశారు. హీరోగా దాదాపు 30 చిత్రాల్లో నటించారు.

వసూల్‌ రాజ్‌
పునీత్‌ సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్స్‌ కొల్లగొట్టేస్తుండేవి. ఇక మంచి టాక్‌ అంటే రికార్డులు సృష్టిస్తాయి. 2017లో రిలీజ్‌ అయిన ‘రాజకుమార’ కన్నడ బాక్సాఫీస్‌ హిస్టరీలోనే అత్యంత వసూళ్లు సాధించిన చిత్రంగా పేరు పొందింది.

డ్యాన్సింగ్‌ డైనమైట్‌.. సూపర్‌ సింగర్‌
పునీత్‌ డ్యాన్స్‌కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన డ్యాన్సులు ప్రేక్షకులకు మజా ఇచ్చేవి. అలాగే ఆయన సినిమాల్లో స్టంట్స్‌ కూడా ప్రత్యేకంగా ఉండేవి. నటనతో పాటు తండ్రిలా అద్భుతంగా పాడటాన్ని కూడా పునీత్‌ పుణికి పుచ్చుకున్నారు. తొలి చిత్రం ‘అప్పు’లో ‘తాలిబన్‌ అల్లా అల్లా’ అనే పాటను పాడారు. ఆ తర్వాత ‘వంశీ, జాకీ’ వంటి సినిమాల్లో పాటలు పాడారు. తన సోదరుడు శివ రాజ్‌కుమార్‌ చేసిన ‘లవకుశ, మయిలారీ’ చిత్రాల్లోనూ పాడారు. తన సొంత బ్యానర్‌లో కాకుండా బయట ఎవరి సినిమాలో పాట పాడినా సరే ఆ పారితోషికం విరాళంగా ఇచ్చేసేవారు పునీత్‌. 

బుల్లితెర హోస్ట్‌గా..
కన్నడ సిల్వర్‌ స్క్రీన్‌ని షేక్‌ చేయడంతో పాటు బుల్లితెరపై కూడా హోస్ట్‌గా అలరించారు పునీత్‌. 2012లో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కన్నడ వెర్షన్‌ ‘కన్నడ కోట్యాదిపతి’కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే ‘ఫ్యామిలీ పవర్‌’ అనే కన్నడ షోను కూడా హోస్ట్‌ చేశారు. 

నిర్మాతగా... 
మాస్‌ సినిమాలు, కమర్షియల్‌ సినిమాలతో దూసుకెళ్తున్నప్పటికీ నిర్మాతగా తన టేస్ట్‌ని చూపించుకున్నారు పునీత్‌. 2019లో కన్నడ చిత్రం ‘కవలుదారి’తో నిర్మాతగా మారారు. ఆ ఏడాది కన్నడంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఇదొకటి. ఈ సినిమాను ‘కపటధారి’గా రీమేక్‌ చేశారు సుమంత్‌. ఆ తర్వాత ‘మాయాబజార్‌ 2016, లా, ఫ్రెంచ్‌ బిర్యానీ’ చిత్రాలు నిర్మించారు. ‘లా, ఫ్రెంచ్‌ బిర్యానీ’ చిత్రాలను కోవిడ్‌ వల్ల నేరుగా అమెజాన్‌లో విడుదల చేశారు పునీత్‌. ప్రస్తుతం ‘ఫ్యామిలీ ప్యాక్, వన్‌ కట్‌ టూ కట్‌ యాన్‌ ఫ్లవర్‌ ఈజ్‌ కేమ్‌’ అనే సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.

రెండు రోజుల్లో ప్రకటిస్తానని...
2021లో వచ్చిన ‘యువరత్న’ పునీత్‌ తెరపై కనిపించిన చివరి సినిమా. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఆయన నటించిన తాజా చిత్రం ‘జేమ్స్‌’ విడుదల ఆలస్యం అయింది. ఇటీవల ‘ద్విత్వా’ అనే సినిమాని ప్రకటించారు. అలాగే నవంబర్‌ 1న తన రెండు కొత్త చిత్రాలపై ప్రకటన చేస్తానని ఈ మధ్య పునీత్‌ ట్వీట్‌ కూడా చేశారు. ఈలోపు ఇలా జరిగిపోయింది.

సేవా పునీత్‌
 పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కించిత్‌ గర్వం లేకుండా పెద్దవారిని గౌరవిస్తూ అజాత శత్రువుగా, అందరికీ ప్రియమైనవాడిగా పునీత్‌ రాజ్‌కుమార్‌ కీర్తి పొందారు. మృదుస్వభావి, మితభాషి అనిపించుకున్నారు. పునీత్‌ మంచి నటుడు, డ్యాన్సర్, సింగర్‌... ఇలా వృత్తిపరంగా బహుముఖ ప్రజ్ఞాశాలి. వ్యక్తిగతంగా ‘మంచి మనిషి’.  సేవా కార్యక్రమాలు చాలా చేశారు. దాదాపు 26 అనాథాశ్రమాలు, 45 పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలకు పునీత్‌ సాయం అందిస్తూ వచ్చారు. ‘శక్తిధామ’ అనే సంస్థ ఆధ్వర్యంలో చదువుకుంటున్న దాదాపు 1800 మంది స్టూడెంట్స్‌కు పునీత్‌ సాయంగా ఉంటున్నారు. వరదలు వచ్చినప్పుడు 5 లక్షలు, కరోనా సమయంలో కర్నాటక ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల విరాళాన్ని పునీత్‌ ఇవ్వడం జరిగింది. ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా సహాయాలు చేయాలనే ప్లాన్స్‌ పునీత్‌కి ఉండేవి. అయితే విధి ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు.


‘‘గతంలో ఏం జరిగిందో గుర్తుండదు..
ముందు ఏం జరుగుతుందో తెలియదు...
ఏమి తిన్నామో.. ఎక్కడ పడుకున్నామో అన్నీ మరచిపోతాం....
అంతా విధి.. మనదేమీ లేదు...’’ 
ఒక సినిమాలో పునీత్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. 
నిజమే... విధి మన చేతుల్లో ఉండదు.
అయితే మరణించాక కూడా జీవించడం మన చేతుల్లో ఉంటుంది.
పునీత్‌ రాజ్‌కుమార్‌ తాను చేసిన మంచి పనుల్లో జీవించే ఉంటారు.
పునీత్‌ కళ్లు ప్రపంచాన్ని చూస్తాయి. 
నేత్రదానం చేయాలన్న ఆయన ఆకాంక్షను కుటుంబ సభ్యులు నెరవేర్చారు.
పునీత్‌ మనసు ఉన్నతం... 
మనిషి పునీతం... 
ఆయనకు లేదు మరణం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement