'క' సినిమాతో భారీ విజయాన్ని కిరణ్ అబ్బవరం అందుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో 'క' సినిమాను విడుదల చేయాలనుకుంటే ఎదురైన ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడారు. అదే సమయంలో అమరన్ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ గురించి కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు.
దీపావళి సందర్భంగా క సినిమాతో పాటు అమరన్ కూడా విడుదలైంది. అమరన్ పూర్తిగా తమిళ్ సినిమా.. ఇక్కడ తెలుగు డబ్బింగ్ వర్షన్‌లో మాత్రమే విడుదలైంది. తమిళనాడులో ఏ స్థాయిలో అయితే అమరన్‌కు థియేటర్స్ దక్కాయో తెలుగులో కూడా అంతే స్థాయిలో దక్కాయి అనేది నిజం. ఇప్పుడు ఇదే విషయాన్ని కిరణ్ అబ్బవరం పరోక్షంగా ఇలా చెప్పుకొచ్చారు.
'తమిళనాడులో ఉండే మన తెలుగు వారు 'క' సినిమాను ఇక్కడ ఎందుకు విడుదల చేయలేదని కోరుతున్నారు. నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. కానీ, అక్కడ తెలుగు సినిమాకు థియేటర్లు ఇవ్వలేదు. కనీసం తెలుగు వర్షన్‌లో విడుదలైతే చాలని కోరుకుంటున్నాను. మంచి విజయం సాధించిన సినిమాకు తమిళ్ కనీసం పది స్క్రీన్స్ ఇచ్చినా సంతోషమే. తమిళ్ సినిమా 'అమరన్'ను ఇక్కడ సూపర్ హిట్ చేశాం.. 'క' కోసం అక్కడ పది స్క్రీన్లు ఇస్తే చాలు అంటూ కిరణ్ అబ్బవరం కోరారు. ఇదే సమయంలో 'క' పార్ట్2 కూడా ఉంటుందని ఆయన ప్రకటించారు.
కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’. సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. రెండురోజులకు గాను ఈ చిత్రం రూ. 13.11 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment