List Of Upcoming Telugu Movies Released In August 2023 - Sakshi
Sakshi News home page

ఆగస్ట్‌లో ‘మెగా’ సందడి.. వారానికో సినిమా, బరిలో చిన్న చిత్రాలు కూడా!

Published Tue, Aug 1 2023 12:30 PM | Last Updated on Tue, Aug 1 2023 1:07 PM

List Of Upcoming Telugu Movies Released In August 2023 - Sakshi

టాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా కొనసాగుతుంది. జులై నెలలో ప్రతివారం రెండు, మూడు చిన్న సినిమాలు థియేటర్స్‌లో సందడి చేశాయి. వాటిల్లో కొన్ని హిట్‌ టాక్‌ని సొంతం చేసుకున్నాయి. ఇక ‘బేబీ’ చిత్రం అయితే భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. కంటెంట్‌ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ‘బేబీ’తో మరోసారి రుజువైంది. అందుకే ఆగస్ట్‌లో కూడా వరుసగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. మొదటి వారం(ఆగస్ట్‌  4) ప్రముఖ క్రికెటర్‌ ధోనీ నిర్మించిన తొలి సినిమా ‘ఎల్‌జీఎం’విడుదల కానుంది. దీంతో పాటు కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన ‘హెబ్బులి’, ‘రాజుగారి కోడి పలావ్‌’, ‘విక్రమ్‌ రాథోడ్‌’, ‘దిల్‌సే, ‘మిస్టేక్‌’, ‘మెగ్‌ 2’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. 

మెగాస్టార్‌ Vs సూపర్‌ స్టార్‌
ఇక ఆగస్ట్‌ రెండోవారంలో రెండు పెద్ద చిత్రాలు బాక్సాఫీస్‌ బరిలోకి దిగబోతున్నాయి. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం ‘జైలర్‌’. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆ తర్వాతి రోజు అంటే ఆగస్ట్‌ 11న మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్‌ ’రిలీజ్‌ కాబోతుంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటించగా, కీర్తి సురేశ్‌ కీలక పాత్ర పోషించింది.

అటు ‘జైలర్‌’, ఇటు ‘భోళా శంకర్‌’ ‍ల మధ్య మరో చిన్న చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్‌’ చిత్రం ఆగస్ట్‌ 12న విడుదల కాబోతుంది. ఇలా ఆగస్ట్‌ రెండో వారంలో రెండు పెద్ద చిత్రాలతో పాటు ఒక చిన్న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే హిందీ నుంచి కూడా రెండు ఆసక్తికరమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘ఓ మై గాడ్‌ 2’, సన్నీదేఓల్‌ నటించిన ‘గదర్‌ 2’ చిత్రాలు ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా రెండు సూపర్‌ హిట్‌ సినిమాల సీక్వెల్స్‌ కావడం గమనార్హం. 

మూడో వారంలో నాలు చిన్న చిత్రాలు
ఆగస్ట్‌ మూడో వారంలో అన్ని చిన్న సినిమాలే విడుదల కానున్నాయి. రెండో వారంలో జైలర్‌, భోళాశంకర్‌ లాంటి బడా సినిమాలు రావడంతో మూడో వారం ఎలాంటి పెద్ద సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చేందుకు సాహసం చేయలేదు. దీంతో ఈ వారం మళ్లీ చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. ఆగస్ట్‌ 18న వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘ఆదికేశవ’తో పాటు శ్రీకాంత్‌ అడ్డాల ‘పెదకాపు 1’, సోహైల్‌ ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’, ‘నచ్చినవాడు’ చిత్రాలు విడుదలకానున్నాయి. 

‘మెగా’ సందడి
ఆగస్ట్‌లో నెలలో వరుసగా మెగా హీరోలు సందడి చేయనున్నారు. రెండో వారం ‘భోళా శంకర్‌’తో చిరంజీవి వస్తే... మూడో వారం ఆయన మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆది కేశవ’అంటూ అలరించడానికి రెడీ అయ్యాడు. ఇక నాలుగో వారం మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘గాంఢీవధారి అర్జున’ విడుదల కాబోతుంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌. ఆగస్ట్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే కార్తికేయ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’ చిత్రం కూడా అదే రోజు రిలీజ్‌ కాబోతుంది. వీటితో పాటు ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించిన హిందీ చిత్రం ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’ కూడా ఆగస్ట్‌ 25న విడుదల కాబోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement