
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు నేటితో తెరపడుతుంది. ఈ రోజు (అక్టోబర్ 10) ‘మా’ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విన్నర్లు ఎవరనేది ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. ఓటర్లు ఎవరూ గెలిస్తే వారికే తన మద్దతు ఉంటుందన్నారు.
ఎవరూ గెలిచిన ఓడినా అందరం కలిసి కట్టుగా ఉంటామని, ‘మా’ను ఒక లెవల్‌కు తీసుకెళ్తాం అన్నారు. ఏకగ్రీవంపై వస్తున్న వార్తలకు ఆయన స్పందిస్తూ.. ప్రజాస్వామ్య పద్దతి ప్రకారం ఎన్నికలు జరగడం అనివార్యమని, దానిని ప్రతి ఒక్కరు ఆనందంగా స్వాగతించాలన్నారు. అలాగే సభ్యుల మధ్య నెలకొన్న విమర్శలు, దూషణలపై కూడా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఇవన్ని సహజమని, ఆ తర్వాత అందరం కలిసి కట్టుగా ‘మా’ సమస్యలను పరిష్కరించుకుంటామని చిరంజీవి పేర్కొన్నారు.
మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ఇద్దరూ అన్నదమ్ముల్లాంటివారే
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, విష్ణు అన్నదమ్ముల్లాంటి వారని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఇండస్ట్రీకి మేలు చేస్తారో వారికే ఓటేశాను. ఇద్దరూ ఇండస్ట్రీకి బాగా చేసేలా కనిపిస్తున్నారు. దీంతో రెండు ప్యానెల్లో ఉన్న వారికి ఓటు వేశాను. ప్రకాశ్ రాజ్, తమ్ముడు విష్ణు ఇండస్ట్రీకి అన్నదమ్ముళ్ల లాంటి వారే. మాటల్లో చెప్పడమే కాకుండా చేతుల్లో చేసి చూపించేవారు. రేపు షూటింగ్‌లలో మళ్లీ కలిసి పని చేసుకునే వాళ్లమేనని తెలిపారు.