
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రతిసారీ అధ్యక్ష పదవికి ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటి హేమ ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌పై వ్యాఖ్యలు ఇటీవల దూమారం రేపాయి. దీంతో హేమకు ‘మా’ క్రమ శిక్షణ సంఘం వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నటి హేమపై చర్యలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ క్రమశిక్షణ సంఘం హేమకు ఊరట ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదే మొదటి తప్పిదంగా హేమని హెచ్చరిస్తూ ఆమెపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని సమాచారం. డీఆర్‌సీ కోరినట్లుగా హేమ తన వివరణను ఇవ్వగా.. ఆ వివరణకు సంతృప్తి చెందని డీఆర్‌సీ ఇది ఆమె మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నామని, మరోసారి రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.
కాగా నరేశ్‌పై నటి హేమ ఫండ్ రైజ్ చేసిన డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేయగా, నరేష్ స్పందిస్తూ ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇలా అభ్యర్థులు ఒకరిపై ఒకరూ తీవ్ర ఆరోపణలతో గతంలో ఎన్నడూ లేనంతగా ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలపై చిరంజీవి తొలిసారిగా స్పందించారు. ఎన్నికలు వెంటనే జరపాలని, ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా 'మా' ప్రతిష్ట దెబ్బతీస్తున్న ఎవరినీ ఉపేక్షించవద్దంటూ 'మా' క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణం రాజుకు ఆయన లేఖ రాసిన సంగతి తెలిసిందే.