మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. రోజుకో ట్విస్ట్‌తో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారం ముమ్మరం చేశారు. అధ్యక్ష బరిలో అభ్యర్థులంతా ఎవరికివారు గెలుపు కోసం విందులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు(ఆదివారం) ప్రకాశ్ రాజ్ ‘మా’ కళాకారలను విందుకు ఆహ్వానించాడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే దీనిని నిర్మాత బండ్ల గణేష్ తీవ్రంగా ఖండించాడు.
(చదవండి: ‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ విందు ఆహ్వానంపై బండ్ల గణేశ్ కౌంటర్)
‘దయచేసి ‘మా’ కళాకారులను విందులు, సన్మానాల పేర్లతో వారందరిని ఒక దగ్గరకు చేర్చొద్దు. ఎందుకంటే గత రెండేళ్లలో అందరు కరోనా భయంతో బ్రతుకుతున్నారు. చాలా మంది చావు దాకా వెళ్లొచ్చారు. అందులో నేను ఒకడిని. ఓటు కావాలంటే ఫోన్ చేసి, మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి. అంతేకానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి కళాకారుల ప్రాణాలతో చెలగాటమడోద్దని నా మనవి’ అని పరోక్షంగా ప్రకాశ్ రాజ్ విందును విమర్శించారు.
ఇక బండ్ల గణేశ్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చాడు. అసోసియేషన్ ఎన్నికలు అన్నాక అందరితో చర్చలు, క్యాంపెయిన్ చేయడం జరుగుతుందని కామన్ అన్నారు. అందులో భాగంగానే ఈ రోజు కొంతమంది ఆర్టిస్టులను లంచ్‌కు పిలిచానని, వారితో సమస్యల గురించి చర్చించామని తెలిపారు. ఇప్పటి వరకు ‘మా’లో జరిగిన పనులు, మున్ముందు జరగాల్సిన పనుల గురించి దాదాపు 3 గంటల పాటు అందరితో మాట్లాడడం జరిగిందన్నారు. బండ్ల గణేశ్ వ్యాఖ్యలను తాను నిజంగానే షాకయ్యానని తెలిపాడు. గుజరాత్‌తో పాటు మరికొన్ని చోట‍్ల ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడికి అందరు వెళ్తున్నారు.. మరి దాని గురించి బండ్ల గణేశ్ ఏం మాట్లాడుతారు? అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు. ‘మా’ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 19న వస్తుందని, ఆ తర్వాత అన్ని విషయాలు తెలియజేస్తానని తెలిపారు.
కరోనా రూల్స్ పాటిస్తూ ఈ సమావేశం జరిగింది: జీవితా రాజశేకర్
కరోనా నియమాలను పాటిస్తూనే ప్రకాశ్ రాజ్ సమావేశం జరగిందన్నారు నటి, దర్శకురాలు జీవితా రాజశేకర్. కరోనా భయంలో ఎన్ని రోజులు ఇంట్లో కూర్చొని ఉంటామని ఆమె ప్రశ్నించారు. కోవిడ్ నియమాలను పాటిస్తూ పెళ్లిళ్లు, సభలు, సమావేశాలు జరుగుతున్నాయని, తాము కూడా అవే నియమాలను పాటిస్తూ విందు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. బండ్ల గణేశ్ ప్రతిసారి తన గురించే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment