కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా పరిశ్రమలో హీరోల ఆదిపత్యమే ఎక్కువగా ఉంటుందని చాలామంది హీరోయిన్‌లు లేవనెత్తారు. తాజాగా నటి మాళవిక మోహన్ ఇదే గోడును వ్యక్తం చేశారు. ఈ కేరళ బ్యూటీ కోలీవుడ్‌లో పేట చిత్రం ద్వారా అక్కడ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ఆ చిత్రంలో శశికుమార్‌కు భార్యగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఈమెకు నటుడు విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశం వరించింది. అందులో ఈమె పాత్ర పరిధి తక్కువే అయినా చిత్రం హిట్ కావడంతో అందులో తానూ భాగం పంచుకున్నారు.
ఆ తరువాత ధనుష్‌కు జంటగా నటించిన 'మారన్' తదితర చిత్రాల్లో నటించారు. తాజాగా విక్రమ్ కథానాయకుడిగా నటించిన 'తంగలాన్' చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషించి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటుడు కార్తీకి జంటగా 'సర్దార్–2' చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తెలుగులో ప్రభాస్‌కు జంటగా 'ది రాజాసాబ్' చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. దీంతో మాళవిక మోహన్ పాన్ ఇండియా నటిగా ముద్ర వేసుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల ఈమె ఒక భేటీలో చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితిని ఏకరువు పెట్టారు.
ఆమె మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు ప్రాముఖ్యతనివ్వడం లేదనన్నారు. ఒక చిత్రం వసూళ్ల పరంగానూ విమర్శల పరంగానూ మంచి విజయాన్ని సాధిస్తే ఆ క్రేడిట్ అవార్డులు హీరోలే పొందుతున్నారన్నారు. హీరోయిన్లు మాత్రం ఎక్కువగా గుర్తింపు రావడం లేదని వాపోయారు. అదే చిత్రం అపజయం పాలైతే అందులో నటించిన హీరోయిన్ దురదృష్టవంతురాలు అని ముద్ర వేస్తున్నారన్నారు. ఈ పరిస్థితి దక్షిణాదిలో మాత్రమే కాదని, ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ తాను చూస్తున్నానని, ఇదే పెద్ద సమస్య అని నటి ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment