
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాజాగా నటించిన చిత్రం దృశ్యం2 ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆయన మరోసారి తన మార్క్ నటనతో ప్రేక్షకులు, విమర్శకుల మన్ననలు పొందారు. ఆయన ఎటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి సినిమాను మరో స్థాయికి తీసుకువెళతారు. 60 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా ఆయన ఓ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ఎక్సర్‌సైజ్ చేస్తే శరీరంతో పాటు మానసికంగా చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాం’ అని కాప్షన్ జతచేశారు.
ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ వయసులో కూడా మీరు జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తూ మాకు స్పూర్తిగా నిలుస్తున్నారు, సూపర్ సార్, మీరు నిజమైన సూపర్ స్టార్’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఇటీవల బెంగళూరులోని అమృత ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. అంతేకాదు ఎలాంటి సందేహం లేకుండా అర్హులైన వారంతా టీకా తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో భాగమైన కంపెనీలకు, భారత ప్రభుత్వానికి, వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సినిమాల విషయానికి వస్తే.. బరోజ్ సినిమాతో మోహన్‌లాల్ డైరక్టర్‌గా అవతారమెత్తారు. ప్రస్తుతం ఆయన బరోజ్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్‌కానున్నట్లు తెలుస్తోంది.