శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనుకునే ఆస్తికులు.. సైన్స్ తప్ప ఈ బ్రహ్మాండాన్ని ఏది నడిపించదు అనుకునే నాస్తికులు.. ఎవరిది నిజం అని చెప్పే ప్రయత్నమే 'బస్‌లో టైం ట్రావెల్' అనే షార్ట్ ఫిలిం. బలగం నటుడు మీమె మధు, ఆకాశవాణి ప్రభు, కనకరెడ్డి, అన్నపూర్ణ, కిట్టు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్‌కుమార్ జాణ దర్శకత్వం వహించగా నరేశ్ సముద్రాల నిర్మించాడు. ఈ షార్ట్ ఫిలిం ఎలా ఉందో చూసేద్దాం..
డబ్బులొచ్చాక కళ్లు నెత్తికి..
కోటేశ్వరరావు.. కటిక పేదవాడు.. అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరుడయ్యాడు. కానీ డబ్బుతో పాటు అహం, పొగరు, చెడు అలవాట్లు అన్నీ అలవడ్డాయి. కుటుంబాన్ని సైతం లెక్కచేసేవాడు కాదు. అతడి జీవితంలో జరిగిన ఓ విచిత్రమే ఈ షార్ట్ ఫిలిం. అప్పటివరకు కళ్లు నెత్తి మీదున్న కోటేశ్వరరావుకు ఒక్క బస్ జర్నీతో తను చేసిన తప్పులేంటో తెలుసుకుంటాడు.
ఒక్క జర్నీతో తప్పు తెలుసుకుని..
పైసా పిచ్చితో కుటుంబాన్ని, జనాలను ఎంత టార్చర్ పెట్టాడో అర్థం చేసుకుంటాడు. ఇంటికి వెళ్లి చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తాడు. ఒక్కసారిగా మారిపోతాడు. అవమానించిన వాళ్లను ప్రేమించడమే గొప్ప.., సంపాదించడమే గొప్ప అయితే సాటి మానవుడి ఆకలి తీర్చడం అంతకంటే గొప్ప, కనబడని దేవుడిని వెతకకు.. నీలో ఉన్న దేవుడిని వెతుక్కో.. వంటి డైలాగులు బాగున్నాయి.
అప్పుడు మనిషే దేవుడు
"ప్రతి జీవి దానికి కనిపించే ప్రపంచాన్ని మాత్రమే చూస్తుంది. మనిషి దృష్టిలో చీమెంతో, దేవుడి దృష్టిలో మనిషి కూడా అంతే! దేవుడు ఉన్నాడా లేదా అని కనీసం మనుషులుగా వాదించుకుంటున్నాం. మిగతా జీవులన్నిటికి అసలు ఈ వాదనలు కూడా లేవు. ఎందుకంటే దేవుడి కాన్సెప్టే వాటికి తెలియదు. అందుకే కనబడని దేవుడు ఏదో చేస్తాడని చూడక, దేవుళ్ల పేరుతో ఖర్చు పెట్టే కోట్ల డబ్బులో కొంత పేదవారికి ఖర్చు పెట్టండి. అప్పుడు మనిషే దేవుడు అవుతాడు. సాటి మనిషికి సాయం చేసిన వాడే దేవుడు అని చెప్పడం.. బతికే ఈ చిన్న జీవితంలో గొడవలు, కొట్లాటలు, కుళ్లు కుతంత్రాలు మాని అందరితో కలిసి మెలిసి బతకాలని చెప్పడమే.. మా ఈ షార్ట్ ఫిల్మ్ ఉద్దేశ్యం" అని చివర్లో గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఈ షార్ట్ ఫిలింను కింద మీరూ చూసేయండి..
Comments
Please login to add a commentAdd a comment